చిన్న సినిమాలతో సత్తా చాటుతున్న కరీంనగర్‌ డైరెక్టర్‌  | Special Story On Short Films Director Ram Mogiloji | Sakshi
Sakshi News home page

వేయి చిత్రాల దర్శకుడు.. సత్తా చాటుతున్న కరీంనగర్‌ డైరెక్టర్‌ 

Published Sun, Jan 8 2023 3:21 PM | Last Updated on Sun, Jan 8 2023 4:45 PM

Special Story On Short Films Director Ram Mogiloji - Sakshi

షార్ట్‌ ఫిల్మ్‌ నిర్మాణంలో నటీనటులకు సూచనలిస్తున్న రామ్‌

సాక్షి, విద్యానగర్‌(కరీంనగర్‌): పాటమ్మతోట ప్రాణం నాకు చదువులమ్మరా.. అన్నాడో కవి.. పాటల రచన, గానంపై తనకు ఉన్న ఆసక్తిని, ఇష్టాన్ని, ప్రేమని పాట రూపంలోనే చెప్పాడు. అచ్చం ఇలాగే తనకు సినిమాతోపాటు రచన, నటన, షూటింగ్, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌పై ఉన్న ఇష్టాన్ని షార్ట్‌ ఫిల్మ్‌ ల ద్వారా చాటుకుంటున్నాడు కరీంనగర్‌కు చెందిన రామ్‌ మోగిలోజి. తొమ్మిదేళ్ల లఘుచిత్రాల ప్రయాణంలో ఆయన ఆనేక మైలురాళ్లు అధిగవిుంచారు. వెయ్యికిపైగా షార్ట్‌ ఫిల్మ్‌లు తీసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

యూట్యూబ్‌ చానల్‌ ద్వారా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్రియేటివిటీకి కేరాఫ్‌గా మారారు. యూట్యూబ్‌ వీక్షకుల నాడిని పట్టుకున్న ఆయన తొమ్మిదేళ్లలో ఒకటా రెండా ఏకంగా వేయి లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాడు, 1,500 చిత్రాలకు ఎడిటింగ్‌ చేశాడు. 2,500 ఆడ్‌ ఫిల్మ్‌స్, 150 జానపద పాటలు, 30 డాక్యూమెంటరీలు, వివిధ సామాజిక రుగ్ముత పై ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తూ వందకుపైగా తక్కువ నిడివితో లఘుచిత్రాలు తీయడమే కాకుండా 500 షార్ట్‌ ఫిల్మ్‌లలో నటించడం విశేషం.  

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామానికి చెందిన రామ్‌ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న వాటిని అధికమించి ఎంఏ పూర్తి చేసి మ ల్టీమీడియా, ఎడిటింగ్, అనీమినేషన్‌లో కోర్స్‌ పూర్తి చేశారు. నాలుగేళ్లపాటు మల్టీమీడియా ఫ్యాకల్టీగా పని చేసి ఎంతో మందికి మల్టీమీడియాలో శిక్షణ ఇ చ్చారు. వారిలో చాలా మంది వీడియో మిక్సింగ్‌ యూనిట్స్, ఫొటో స్టూడియోలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు.

వైజయంతి మూవీస్‌ వారి లోకల్‌ టీవీ చానల్‌లో వీడియో ఎ డిటర్‌గా సంవత్సరం పనిచేశారు. సినిమాల మీద మంచి పరిజ్ఞానం ఉండటంతో 2014లో కరీంనగర్‌లో షార్ట్‌ఫిల్మీస్‌ ఎడిటింగ్‌ స్టూడియో ఏర్పాటు చేసి ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తొలిసారిగా షార్ట్‌ ఫిల్మీస్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఆర్‌ఎస్‌ నందతో ‘గుట్టల్లో గుసగుస’ మంచి ఆదరణ పొందింది.

విరాట్‌ క్రియేషన్స్‌..
షార్ట్‌ ఫిల్మీస్‌ ఎడిటింగ్‌లో రాణిస్తూనే విరాట్‌ క్రియేషన్స్‌ పేరున ఫిల్మీ ఏజెన్సీ ఏర్పాటు చేసి యాడ్‌ ఫిల్మీస్‌ రూపొందించడం ప్రారంభించారు. వాటి ద్వారా తన ప్రత్యేకతను చాటుకుని మంచి గుర్తింపు పొందారు. మిత్రులతో కలిసి ఆర్‌ క్రియేషన్‌ బ్యానర్‌పై చల్లా బాలయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడానికి కీలకమైన గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్టపై నిర్మించిన డాక్యుమెంటరీ నిర్మించారు. న్యూజిలాండ్‌ తెలంగాణ తెలుగు భాష అసోసియేషన్‌ నిర్వహించిన తెలంగాణ భాష మహాసభలో, 2017లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ యువ చిత్రోత్సవంలో ప్రదర్శించగా ప్రముఖల ప్రశంసలు అందుకుంది.

విరాట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దర్శక నిర్మాతగా లఘు చిత్రాలు నిర్మిస్తూ, ఇతరులు నిర్మించే చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ ప్రతినెలా దాదాపు 20 వరకు నిర్మాణం జరుపుకునే వాటిలో కొత్తవారికి అవకాశం ఇస్తూ.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. అషాఢం అల్లుడు అత్త లొల్లి, ఇరికిల్లు ఇద్దరు పెళ్లాలు, ప్రేమించే పెనివిుటి, వార్డుమెంబర్‌ శినన్న, పొత్తుల సంసారం తదితర చిత్రాలకు 54 లక్షల వ్యూస్‌ దాటాయి.  


తెలంగాణ ఫిల్మ్, టీవీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుర్మాచలం అనిల్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న రామ్‌ (ఫైల్‌)  

అందుకున్న అవార్డులు, పురస్కారాలు, సత్కారాలు..

  • హైదరాబాద్‌కు చెందిన విశ్వభారతి సంస్థ నుంచి ఉగాది పురస్కారం
  • అమ్మాయి అంటే భారం కాదు ఆస్తి పేరుతో నిర్మించిన చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 
  • ఓ నరుడా చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా ఎమ్మెల్సీ నారదాసు చేతుల మీదుగా అవార్డు
  • జగిత్యాలకు చెందిన కళశ్రీ ఆర్ట్‌ థియేటర్‌ వారిచే రెండుసార్లు కీర్తి సేవా పురస్కారం.
  • ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్‌కు ఉత్తమ పోస్టర్‌ డిజైనర్‌గా నగదు బహుమతి.
  • సినీవారం సంస్థ, బాబా అసోసియేషన్‌ వా రితో వేర్వేరుగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు.
  • గొరెంటి వెంకన్న చేతుల మీదుగా గిడుగు రామ్మూర్తి కీర్తి పురస్కారం.
  • కాళోజీ జయంతి సందర్భంగా ఉత్తమ డైరెక్టర్‌గా జెనీ ఇంటర్నేషనల్‌ అధినేత జైనీ ప్రభాకర్‌ చేతుల మీదుగా అవార్డు.
  • ఉత్తమ దర్శకుడిగా ఎంఎస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు
  • ఫ్రెండ్స్‌ కల్చరల్‌ అకాడమి ద్వారా ఉత్తమ డైరెక్టర్‌ అవార్డు.
  • ఉమ్మడి రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా దర్శకుడిగా 1000 లఘు చిత్రాలు పూర్తి చేసిన సందర్భంగా తెలంగాణ ఫిల్మీ, టీవీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉత్తమ డైరెక్టర్‌ అవార్డు
  • ఆర్టీసీ సేవలపై రూపొందించిన లఘు చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు.
  • బొమ్మలమ్మగుట్ట ప్రాముఖ్యతపై తీసిన డా క్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు.

ఆర్‌ఎస్‌ నంద పరిచయంతోనే..
యూట్యూబ్‌ స్టార్‌ ఆర్‌ఎస్‌ నంద పరిచయం వల్లనే నా దారి లఘు చిత్రాల వైపు మళ్లింది. పల్లె వాతావరణ, కుటుంబ విషయాలు, రోజువారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా కథలు రాసుకుని ఒకటి రెండు రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేసి యూట్యూబ్‌లో ఆప్‌లోడు చేస్తా. వీక్షకుల నుంచి మంచి స్పందన ఉంటుంది.  యూట్యూబ్‌ వీక్షకులు ఇస్తున్న ప్రోత్సాహంతోనే నెలకు 20 వరకు లఘు చిత్రాలు నిర్మిస్తూ తాను ఉపాధి పొందుతూ మరో 50 మందికి ఉపాధి కల్పిస్తున్న.  
– రామ్‌ మోగిలోజి, లఘు చిత్రాల దర్శక నిర్మాత, విరాట్‌ క్రియేషన్స్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement