Squid Game Second Season Confirmed By Netflix: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. నెంబర్ వన్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కోసమే నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్క్రైబ్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువే.
అయితే తాజాగా స్క్విడ్ గేమ్ సిరీస్‌కు రెండో సీజన్ రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కో సీఈవో, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సారండోస్ తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ 2021 నాల్గో త్రైమాసిక ఆదాయం గురించి సారండోస్‌తో ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో సౌత్ కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్‌కు రెండో సీజన్ రానుందా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు సారండోస్ ఇలా జవాబిచ్చాడు. 'కచ్చితంగా. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించిన నెంబర్ 1 సిరీస్. స్క్విడ్ గేమ్ ప్రపంచం ఇప్పుడే ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ అభివృద్ధికి దోహదపడే ఫ్రాంచైజీలో మొదటి స్థానంలో ఉంది. అలాగే రెండో స్థానంలో బ్రిడ్జర్టన్ కాగా తర్వాతి స్థానాల్లో స్ట్రేంజర్ థింగ్స్ ఉన్నాయి.' అని చెప్పుకొచ్చాడు.
అయితే గతంలో కూడా స్క్విడ్ గేమ్ డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ వస్తుందని పేర్కొన్నాడు. ఈ సిరీస్ మొదటి సీజన్‌లో 456 మంది పోటీదారులు డబ్బు కోసం పిల్లలకు సంబంధించిన గేమ్ ఆడతారు. కానీ అందులో ఓడిపోయిన వారిని చంపడం వంటి ఘోరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈసారి సెకండ్ సీజన్ ఎలాంటి గేమ్‌తో రానుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment