‘‘ఒక ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్‌లో తొలిసారిగా ‘సీతారామం’ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా ఓ మంచి సపోర్టింగ్ రోల్ చేశాను. కథ నచ్చితే నెగటివ్ పాత్రలు చేయడానికి రెడీ’’ అని అన్నారు సుమంత్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘సీతారామం’.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్ చేసిన బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్ర లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ... మద్రాస్ రెజిమెంట్’’ అనే డైలాగ్ ఉంటుంది.
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ – ‘‘పదహారేళ్ల క్రితం ‘గోదావరి’ చిత్రంలో సీతరాముల కథను చెప్పాం (ఈ చిత్రంలో హీరో సుమంత్ పాత్ర రామ్, హీరోయిన్ కమలినీ ముఖర్జీ పాత్ర సీత). ఇప్పుడు ఈ ‘సీతారామం’ కథలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నన్ను నటించమన్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వమని హను రాఘవపూడిగారిని అడగడం జరిగింది.
దాదాపు 150 పేజీల స్క్రిప్ట్‌ను చదివి, ఆ తర్వాత విష్ణు శర్మ పాత్రకు ఓకే చెప్పాను. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది. చాలా షేడ్స్ ఉన్నాయి. నెగటివ్ రోల్ కాదు. బ్యూటీఫుల్ అండ్ చాలెంజింగ్ రోల్‌లా అనిపించింది. నా కెరీర్‌లో దుల్కర్ సల్మాన్‌ను ఓ మంచి కో స్టార్‌గా చెబుతాను. జనరల్‌గా సెట్స్‌లో నేను మానిటర్ చూడను. డైరెక్టర్ ఓకే అంటే నాకు ఓకే. ఈ సినిమా రషెస్ చూసి అశ్వనీదత్ గారు నన్ను అభినందించారు. హ్యాపీ ఫీలయ్యాను.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ‘సీతారామం’ చిత్రం మంచి హిట్‌గా నిలుస్తుంది. మరోవైపు నేను హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చూస్తున్నాను. పెద్ద హీరోలు కూడా ఓటీటీ స్పేస్‌లో యాక్ట్ చేస్తున్నారు. నాకు ఆఫర్స్ వస్తున్నాయి. కథ నచ్చితే తప్పకుండా చేస్తాను. అలాగే నాకు, తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు)గారికి పోలికలు ఉన్నాయని చాలామంది చెబుతుంటారు. మా అమ్మగారు తాతయ్యలా ఉంటారు. నేను మా అమ్మ పోలికలతో ఉంటాను (నవ్వుతూ). తాతగారి పోలికలు నాలో ఉండటం నా అదృష్టం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment