‘‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ చూడగానే నవ్వొచ్చింది. ప్రపంచంలో కెల్లా మంచి ప్రేక్షకులు మన తెలుగువాళ్లే. మంచి సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. అందుకే మన ప్రేక్షకులకి దండం పెట్టాలి’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ప్రజ్వల్ బీపీ, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స ప్రధాన పాత్రల్లో, అతిథిగా రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. ఈ చిత్రాన్ని ‘బాయ్స్ హాస్టల్’గా అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రలు చేశారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుప్రియ చెప్పిన విశేషాలు.
► ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ సినిమాని అనువదించడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే వందకు పైగా వాయిస్‌లు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి వాయిస్‌ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు డబ్ చేశాం. ‘బాయ్స్ హాస్టల్’ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు స్ట్రయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్లు సినిమాలను చాలా చక్కగా చేస్తున్నారు.. అందుకే వాళ్లతో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
► వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ‘మనం’ సినిమా షూటింగ్ మరో పది రోజులు ఉందనగా తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ఆరోగ్య పరిస్థితి తెలిసింది. అప్పటికే ఆయన 255 సినిమాలు చేశారు. ‘మనం’ ఆయన చివరి సినిమాగా పూర్తి చేయాలనుకున్నపుడు ఎంతో ఒత్తిడి ఉండేది. రోజుకు 22 గంటలు పని చేశాం. అయితే ఆ టైమ్‌లో ఎవరితోనూ తిట్టించుకోవడం గొప్ప విషయం (నవ్వుతూ). తాతగారు ఇప్పటికీ నెలకోసారి కలలోకి వచ్చి నన్ను తిడుతుంటారు (నవ్వుతూ).
► నాగార్జునగారి కంటే మంచి నిర్మాత ఎవరూ లేరు. ఆయన యాక్టర్ అవ్వడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలిచిందని భావిస్తాను. స్టూడియో ప్రారంభమైన కొత్తల్లో కరెంటు బిల్లు కూడా కట్టేంత ఆదాయం వచ్చేది కాదు. తాత, అమ్మమ్మ (ఏఎన్‌ఆర్–అన్నపూర్ణ) బాధ పడేవారు. ఇప్పుడు ఈ స్టూడియో ఇంత పెద్దగా ఎదిగిందంటే ఇందులో తాతగారు, నాగార్జునగారి కృషి ఉంది. నాకు యాక్టింగ్ వస్తుందా? రాదా అని చెక్ చేసుకోవడానికి ‘గూఢచారి’ చేశాను (నవ్వుతూ). ‘గూఢచారి 2’లో నా పాత్ర ఉంటే నటిస్తాను. మా బ్యానర్‌లో నాగచైతన్య, అఖిల్‌లతో ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment