తమ్ముడంటే తనకెంతో ఇష్టమని, ఇప్పటికీ ప్రతిరోజూ తనను చూడాలనే ఆశతో నిద్ర లేస్తున్నానని బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ఉద్వేగానికి లోనయ్యారు. త్వరలోనే తనని కలుస్తానని చెప్పాడని.. కానీ అంతలోనే శాశ్వతంగా దూరమయ్యాడంటూ సోదరుడితో తనకున్న జ్ఞాపకాల గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ తల్లిదండ్రులకు మొదటి సంతానంగా కొడుకు పుట్టాడని.. అయితే కొన్నిరోజులకే తను మరణించినట్లు చెప్పుకొచ్చారు. తనకు సోదరుడు లేకుండా పోయాడన్న బాధను తీర్చిన సుశాంత్ కూడా ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నానని.. ఇదంతా ఓ పీడకల అయితే బాగుండేదని ఆవేదన చెందారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పలు ఫొటోలు షేర్ చేసిన శ్వేత.. తన చిన్ననాటి జ్ఞాపకాలు, సుశాంత్‌తో బంధం గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు.(దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్)
తన కళ్లల్లో మెరుపులు.. ముద్దుగా ఉండేవాడు
‘‘అమ్మానాన్నలు కొడుకు కావాలని కోరుకున్నారు. అనుకున్నట్లుగానే తొలి సంతానంగా బాబు జన్మించాడు. అయితే తను ఏడాదిన్నరకే మరణించాడు. దాంతో నిర్వేదంలో మునిగిపోయిన అమ్మానాన్న ఎన్నో, పూజలు, నోములు నోచారు. మళ్లీ కొడుకు పుట్టాలని ప్రార్థనలు చేశారు. రెండేళ్ల తర్వాత దీపావళి రోజున నేను పుట్టాను. నన్ను లక్ష్మీదేవి ప్రసాదంగా భావించి ఎంతో గారాబంగా పెంచారు. ఆ తర్వాత ఏడాది తమ్ముడు పుట్టాడు. అందమైన చిరునవ్వు, కళ్లల్లో మెరుపులు.. ముద్దు ముద్దుగా ఉండే తన మఖం.. నా తోబట్టువు వచ్చేశాడు. పెద్దక్కగా వాడిని కాచుకుని ఉండటం నా బాధ్యతగా భావించేదాన్ని. ఇద్దరం కలిసి స్కూల్‌కు వెళ్లేవాళ్లం. తను యూకేజీలో ఉన్న సమయంలో అర కిలోమీటరు నడిచి లంచ్‌బ్రేక్‌లో నన్ను చూసేందుకు వచ్చాడు. నాతోనే ఉంటానని మారాం చేశాడు. అప్పుడు టీచర్లకు తెలియకుండా తనని దాచిపెట్టాను’’ అంటూ తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!)
ఇక 2007లో తన పెళ్లై అమెరికాకు వెళ్లిపోతున్న సమయంలో సుశాంత్ తనను గట్టిగా హత్తుకుని, బిగ్గరగా ఏడ్చేశాడన్న శ్వేత.. భౌతికంగా దూరమైనప్పటికీ తమ మనసులు ఎప్పుడూ దూరం కాలేదని చెప్పుకొచ్చారు. కాలక్రమంలో ఇద్దరం బిజీ అయిపోయామని.. బాలీవుడ్ హీరోగా సుశాంత్ తమను గర్వపడేలా చేశాడని పేర్కొన్నారు. డిప్రెషన్‌తో బాధ పడుతున్న సోదరుడిని అమెరికా రావాల్సిందిగా కోరానన్న ఆమె.. జూన్ 10న తమ్ముడితో జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఈ సందర్భంగా షేర్ చేశారు.(‘సుశాంత్‌ది ఆత్మహత్య కాదు..’)
‘‘లవ్ యూ బాబూ. నా దగ్గరకు రావొచ్చు కదా’’ అని శ్వేత పేర్కొనగా.. ‘‘అక్కడికి రావాలని మనసు ఉబలాటపడుతోంది అక్కా’’ అని సుశాంత్ బదులిచ్చాడు. ఇందుకు స్పందించిన శ్వేత.. ‘‘వచ్చెయ్.. ఓ నెలరోజుల పాటు ఇక్కడే ఉండు. బాగుంటుంది’’అని తమ్ముడికి సాంత్వన చేకూర్చారు. కానీ అంతలోనే (జూన్ 14) సుశాంత్ బలవన్మరణానికి పాల్పడి ఆ అక్కకు, కోట్లాది మంది అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. కాగా ప్రస్తుతం శ్వేత పోస్టు చూసిన సుశాంత్ ఫ్యాన్స్.. లాక్‌డౌన్ లేకపోయి ఉంటే అతడు అమెరికా వెళ్లేవాడని.. అలా అయినా బతికేవాడేమో అంటూ ఉద్వేగభరిత కామెంట్లు చేస్తున్నారు. కాగా సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచారా శుక్రవారం ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment