
వ్యక్తిగత జీవితానికి తాను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకోవాల్సిన తరుణం వచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారు హీరోయిన్ తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ వివాహం గత నెల 23న ఉదయ్‌పూర్‌లో జరిగిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాప్సీ, మథియాస్ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ వధూవరులుగా తాప్సీ, మథియాస్ ఉన్న వీడియోలు వైరల్ అవుతుండటంతో వీరిద్దరికీ వివాహం జరిగిందని స్పష్టమైంది. కాగా పెళ్లి తర్వాత తాప్సీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘కొన్నేళ్లు గడిచిన తర్వాత నేను నటించిన సినిమాల జాబితాను ఓ సారి చూసుకున్నప్పుడు ఆ జాబితా నాకు సంతోషాన్నివ్వాలి. ఎందుకుంటే నా జీవితంలోని ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించాను. 24 గంటల్లో నేను పన్నెండు గంటలు పని చేసిన రోజులూ ఉన్నాయి. అయితే ఇకపై నేను నా వృత్తి జీవితంపైకన్నా, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా వదులుకోకూడదు అనిపించేంత మంచి స్క్రిప్ట్ అయితేనే చేయాలనుకుంటున్నాను. కెరీర్‌కి మించిన జీవితం ఒకటి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సమయం గడపాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment