
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ చిత్రంలో పలు ప్రత్యేకతలు సంతరించుకోవడమే ఇందుకు కారణం. తలైవా ఇంతకు ముందు నటించిన అన్నాత్తే ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 70 దాటిన వయసులోనూ సూపర్‌స్టార్ ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తున్న రజనీకాంత్‌కు ఈ చిత్రం విజయం చాలా అవసరం.
సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించడం పైనా చర్చ జరుగుతోంది. కారణం ఈయన ఇంతకుముందు విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కించిన బీస్ట్ చిత్రం నిరాశ పరచడమే. అయితే ఇలాంటి దర్శకుడితో రజనీకాంత్ చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపారంటే కథలో విషయం ఉండే ఉంటుంది. చిత్రానికి జైలర్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి రజనీకాంత్‌తో చేసిన ఫొటో షూట్ అదిరిపోయింది.
మరో విషయం ఏంటంటే ఇందులో తలైవా డబుల్‌రోల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క అంశం చాలు ఆయన అభిమానులు పండుగ చేసుకోవడానికి. చిత్రంలో భారీ తారాగణం నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించే వారి లిస్టులో అందాలరాశి ఐశ్వర్యరాయ్, రమ్యకృష్ణ, ప్రియాంక మోహన్ వంటి వారితో పాటు ఇప్పుడు తమన్నా పేరు వినిపిస్తోంది.
రజనీకాంత్–రమ్యకృష్ణ ధీటుగా నటించిన పడయప్పా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల తరువాత ఈ జంట మళ్లీ ఇప్పుడు జైలర్ చిత్రంలో నటించనుండటంతో చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ద్విపాత్రాభినయం చేస్తున్న రజనీకాంత్‌కు ఒక పాత్ర సరసన రమ్యకృష్ణ నటించబోతున్నారు. రెండో పాత్రకు నటి తమన్నా జత కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే తలైవాతో తమన్నా నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. చాలా గ్యాప్ తరువాత ఈ మిల్కీ బ్యూటీ కోలీవుడ్‌కు రీ ఎంట్రీ చిత్రం కూడా ఇదే అవుతుంది. ఇకపోతే దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment