తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం గురువారం థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఆటలు ప్రదర్శన వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. లియో చిత్రానికి ప్రభుత్వం 19వ తేదీ నుంచి 24వ తేది వరకు రోజుకు 5 ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అయితే మరో ఆటను వేకువజామున 4 గంటలకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాత ఎస్ ఎస్.లలిత్ కుమార్ చైన్నె హైకోర్టును ఆశ్రయించగా.. అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఉదయం 9 గంటల ఆటకు బదులు 7 గంటలకు అనుమతించే విషయంపై పరిశీలించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. కాగా మరో పక్క సినీ డిస్ట్రిబ్యూటర్లు తమకు 5 ఆటలు చాలని ప్రకటించడం మరోవైపు ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వం మారినా..?
ఇదిలా ఉంటే విజయ్ చిత్రం అంటేనే సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో విజయ్ నటించిన చిత్రాలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడమేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రఘుపతిని మీడియా ప్రశ్నించింది.
లియో చిత్రం విషయంలో రాజకీయం ఉందనే ప్రచారం జరుగుతోందని.. రాజకీయాల్లో కొనసాగుతున్న కొందరు నిర్మిస్తున్న చిత్రాలకు ఎలాంటి సమస్యలు లేకుండా అనుమతిస్తున్నారనే విమర్శకు మీ సమాధానం ఏమిటన్న ప్రశ్నకు చిత్ర పరిశ్రమ విషయంలో విభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన బదులిచ్చారు. చిత్ర పరిశ్రమతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
కాగా.. న్యాయస్థానంలో ఉపశమనం లభించకపోవడంతో లియో చిత్ర నిర్మాత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అముదను కలవడానికి వచ్చిన నిర్మాత తరపు న్యాయవాదుల కారు యాక్సిడెంట్‌కు గురైంది. తిరుగుముఖం పట్టిన న్యాయవాదుల కారును డ్రైవర్ మలుపు తిప్పుతుండగా అటుగా వస్తున్న మహిళ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. లియో చిత్రం గురువారం విడుదల అని ప్రకటించినా ఇప్పటి వరకు చాలా థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment