ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్ షూటర్స్ ద్వయం (చంద్రో తోమర్–89, ప్రకాశీ తోమర్–84)లో ఒకరైన చంద్రో తోమర్ ఇటీవల తుదిశ్వాస విడిచారు. కోవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంతోనే ఆమె కన్ను మూశారు. ఈ షూటర్స్ ద్వయం జీవితం ఆధారంగా హిందీలో ‘సాండ్ కీ ఆంఖ్’ (2019) చిత్రం రూపొందింది. తుషార్ హీరానందాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చంద్రోగా భూమీ పెడ్నేకర్, ప్రకాశీగా తాప్సీ నటించారు. ఇటీవల చంద్రో మరణించినప్పుడు భూమి, తాప్సీ ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రీకరణ రోజులను గుర్తు చేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు.
చంద్రో మరణం, ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రీకరణ అనుభవాల గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘సాండ్ కీ ఆంఖ్’ అధికారిక ప్రకటన రావడానికి కొన్ని రోజుల ముందు మేం ఓ స్టూడియోలో చంద్రో, ప్రకాశీగార్ల రాక గురించి ఆసక్తిగా ఎదురుచూశాం. వారు వారి జీవితాల్లో సాధించిన ఘనతలు వారి పట్ల మా గౌరవాన్ని మరింత పెంచాయి. మా హృదయాల్లో వారికి అత్యున్నత స్థానం కల్పించాము. అందుకే చంద్రో, ప్రకాశీ దాదీ (బామ్మ)లను చూడాలన్న మా ఉత్సాహం క్షణక్షణానికి పెరిగింది. వాళ్లు వచ్చిన తర్వాత వారితో నేను, భూమి నాన్‌స్టాప్‌గా మాట్లాడాం. జీవితంలో వారు చేసిన పోరాటం, పడ్డ కష్టాలు విన్న మాకు అవి స్ఫూర్తినిచ్చాయి.
దాదీలు చంద్రో, ప్రకాశీల తరం వేరు. మా తరం వేరు. వారి అనుభవాలు, వారు ఎదుర్కొన్న సంఘటనలు, జీవితంలో వారు సాధించిన పరిణతి వంటి వాటిని మేం (తాప్సీ, భూమి) స్క్రీన్ పై ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. వారిలా ఉండడానికి ప్రయత్నించాం. ఈ ప్రాసెస్‌లో మా జీవితంలో మేం ఎంతో నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు చంద్రో దాదీ లేరంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల కరోనా రావడానికి ముందు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స తీసుకుంటున్న చంద్రో దాదీని నేను కలిశాను. ఆమె నన్ను చూసి, గుర్తు పట్టి ఆనందించారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా తిరిగి వచ్చేస్తారనుకున్నాను.
కానీ అప్పుడు ఆమె ఫైట్ చేసి, ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. అప్పటిలానే ఈసారి కూడా ఫైట్ చేసి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తారని ఆశించాం. షఫేలీ (చంద్రో మనవరాలు) ద్వారా మేం చంద్రో దాదీ హెల్త్ ఆప్‌డేట్స్ తెలుసుకునేవాళ్లం. చంద్రో ఇక లేరని, కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారని షఫేలీ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఇటీవల మా అమ్మమ్మగారు చనిపోయినప్పుడు బాగ్‌పత్ (చంద్రో నివసించే ప్రాంతం) మీదుగా ఏడాది తర్వాత ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని, కోలుకుంటున్నారని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ‘సాండ్ కీ ఆంఖ్’ షూటింగ్ సమయంలో దాదీ, నేను ఒకే గదిలో ఉన్నాం. ఆమెతో నేను ఎంతో సరదాగా ఉండేదాన్ని. వారి ఇంట్లో రెండు నెలలు ఉన్నాం. నా కుటుంబ సభ్యురాలిగా దాదీని భావించాను. ఆమె లేరనే నిజం చాలా బాధగా ఉంది’’ అని తాప్సీ ఎమోషనల్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment