ఆ బాధ చూడలేక కూతుర్ని చంపేయాలనుకున్నా: పావలా శ్యామల | Telugu Actor Pavala Syamala Comments On Daughters Health | Sakshi
Sakshi News home page

నా కూతురి బాధను చూడలేకపోతున్నాను

Published Sun, May 30 2021 12:29 AM | Last Updated on Sun, May 30 2021 12:34 PM

Telugu Actor Pavala Syamala Comments On Daughters Health - Sakshi

‘‘మా అమ్మాయికి రెండేళ్ల క్రితం టీబీ వ్యాధి వచ్చినప్పుడు నాకు చేతనైనంత వరకు మందులు ఇప్పించాను. అప్పుడు చిరంజీవిగారు వాళ్ల అమ్మాయితో రెండు లక్షలు పంపించారు. మంచి డాక్టర్‌కి చూపించి, మంచి మందులు వాడాం. టీబీ వ్యాధి నయం అయిపోయింది. అయితే ఉన్నట్టుండి ఈ మధ్య కిందపడిపోయింది’’ అని సీనియర్‌ నటి పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘మాధవి (శ్యామల కుమార్తె) పడిపోయాక, డాక్టరు వద్దకు తీసుకెళితే మూడు చోట్ల కాలు ఎముకలు విరిగాయి.. రాడ్లు వేయాలి.. ఇందుకు రెండు నుంచి మూడు లక్షలు ఖర్చవుతుంది అన్నారు.

ఆపరేషన్‌ చేయించకుంటే కాలు తీసేయాల్సి వస్తుందంటే ఆస్పత్రిలో చేర్పించాను. బిల్లు దాదాపు 4లక్షలయింది. బిల్లులో కొంత మొత్తం తగ్గించాక  రూ.80 వేలు తక్కువ ఉండటంతో ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) వారు చెల్లించారు. రెండు నెలలు ఫిజియోథెరపీ చేస్తే కాలు బాగవుతుందని చెప్పారు. ఫిజియోథెరపీ మొదలుపెట్టాక, ఆ డాక్టరుకే దాదాపు లక్ష రూపాయలు ఫీజు చెల్లించాం. ఇక డబ్బులు చెల్లించలేమని డాక్టర్ని రావద్దని చెప్పాను. కానీ అమ్మాయి పడుతున్న బాధని మాటల్లో చెప్పలేను. దానికి బలమైన ఆహారం పెట్టలేక దాన్ని చంపేయాలని ప్రయత్నం చేశాను. కానీ తల్లిని కదా.. ఆ పని చేయలేకపోయాను.

ఇది తెలిసిన చిరంజీవిగారు నాకు ‘మా’ సభ్యత్వం రుసుము చెల్లించారు. నేను చనిపోయినా ‘మా’ మెంబర్‌ని కాబట్టి అందరూ తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. ఇది ఆయన పుణ్యమే. కానీ ఇంకా మేము అనుభవించాల్సిన అవమానం, నరకం చాలా ఉంది. నా బాధ ఎవరి మనసుల్ని అయినా కదిలిస్తే దయచేసి జాలి పడండి.. కానీ అవమానించకండి.సహాయపడమని ప్రాధేయపడుతున్నా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

చదవండి: నటితో సహజీవనం: ఆమె ఎవరో తెలియదన్న మాజీ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement