‘సలార్’లో ప్రభాస్, ‘హరిహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్
తెలుగు సినిమా టార్గెట్ మారిపోయింది. టార్గెట్ ఆల్ ఇండియా అయిపోయింది. పరభాషలకు హాయ్ చెబుతోంది. అన్ని భాషలకూ సరిపోయే కథలతో సినిమాలు తీస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ‘ఆన్ సెట్’ మీద డజనుకి పైగా ప్యాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్రకటించిన చిత్రాలు అరడజను పైనే ఉన్నాయి. భవిష్యత్తు అంతా ప్యాన్ ఇండియా సినిమాలతో తెలుగు పరిశ్రమ ‘ప్యాన్‌మయం’ కానుంది.
ప్రభాస్ ‘బాహుబలి’కి ప్రేక్షకులు భళా అన్నారు. ప్యాన్ ఇండియా లెవల్‌లో రిలీజైన ‘బాహుబలి’ బాక్సాఫీస్ రికార్డ్స్ కూడా భళా అనిపించాయి. ఆ తర్వాత కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో వందకోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇటు తెలుగు ‘బాహుబలి’ అటు కన్నడ ‘కేజీఎఫ్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంతో దర్శక–నిర్మాతలు, హీరోల టార్గెట్ మారింది. సినిమాల ప్లానింగ్ ప్యాన్ ఇండియా స్థాయిలో జరగడం మొదలైంది. తెలుగులో తొలి ప్యాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అంగీకరించిన ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే. భవిష్యత్‌లో కూడా ప్రభాస్ సినిమా అంటే ఇక అది ప్యాన్ ఇండియన్ మూవీయే అన్నట్లుగా సీన్ మారింది.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రాధేశ్యామ్’ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక పవన్ కల్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఒకేసారి ప్యాన్ ఇండియన్ మూవీ లైన్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) చిత్రం దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానుంది. విదేశీ భాషల్లోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం విడుదల కానుండటం విశేషం.
మరో హీరో అల్లు అర్జున్‌కు ఆల్రెడీ మలయాళ పరిశ్రమలో మల్లు అర్జున్ అని పేరు ఉంది. ఇలాంటి క్రేజ్‌నే ఇండియా లెవల్‌లో సంపాదించుకోవాలని అల్లు అర్జున్ ‘పుష్ప’ అవతారం ఎత్తాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. అంతేకాదు.. ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండో భాగం ఆరంభమైంది. తొలి భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, హీరోగా ఎదిగి ‘అర్జున్‌రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి హిట్స్‌తో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయిపోయారు. యూత్‌లో విజయ్‌కు ఉన్న ఫాలో యింగ్ మరో ప్లస్. ప్యాన్ ఇండియా సినిమాల ఖాతాలో విజయ్ దేరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ కూడా ఉంది.
మరో హీరో అడివి శేష్ అయితే క్షణం, గూఢచారి, ఎవరు వంటి మీడియమ్ బడ్జెట్ చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు శేష్ ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కెరీర్‌లో యాభైకి పైగా సినిమాలు చేసిన హీరోయిన్ సమంత నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం’.
దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఓ పెద్ద హీరో, ఓ పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ అంటే ప్యాన్ ఇండియా మూవీ అనే ట్రెండ్ నడుస్తోంది. రానున్న రోజుల్లో బహు భాషా చిత్రాల నిర్మాణం ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇంకా...
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రకటించిన సినిమా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కనుంది. హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోయేది కూడా ప్యాన్ ఇండియా మూవీయే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కమిట్ అయినవి కూడా ప్యాన్ ఇండియన్ మూవీసే. దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయనున్నారు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు శంకర్‌తో ప్యాన్ ఇండియన్ మూవీ కమిటయ్యారు రామ్‌చరణ్. దర్శకుడు శేఖర్ కమ్ములతో ధనుష్, వంశీ పైడిపల్లితో తమిళ హీరో విజయ్ ప్యాన్ ఇండియన్ అప్పీల్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. రానాతో ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నట్లు నిర్మాతలు ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు గతంలో ప్రకటిం చారు. దర్శకులు ప్రశాంత్ నీల్, వేణు శ్రీరామ్‌లతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమాలు చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని ప్యాన్ ఇండియన్ సినిమాల అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. కొన్ని రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment