తెలుగు హీరోలకు మంచి రోజులు  | Telugu Heros Focus On Pan India Movies | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా వైపు తెలుగు హీరోల చూపు

Published Sun, Sep 6 2020 9:18 AM | Last Updated on Sun, Sep 6 2020 7:26 PM

Telugu Heros Focus On Pan India Movies - Sakshi

యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి–2’ సినిమాలో ఏనుగునెక్కి ఒంటిచేత్తో శూలాన్ని బాణంలాగా వదిలాడు. ఆ బాణం దేశమంతా గట్టిగా తగిలింది. బాణం వేసిన ప్రభాస్‌కు, అలా బాణం వేయమని చెప్పిన రాజమౌళికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పదహారణాల తెలుగు సినిమా పదహారు దారులు పట్టింది. అన్ని భాషలవారు తెలుగుసినిమాను ఆకాశానికి ఎత్తుకున్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పుడు కొత్తగా పాన్‌ ఇండియా సందడి మొదౖలైంది. 

దేశవ్యాప్తంగా ఉనికి చాటుకునే సినిమాలే పాన్‌ ఇండియా మూవీస్‌. పాన్‌ ఇండియా సినిమాల వల్ల దేశంలోని పలు భాషల్లో నటించే అగ్రనటులందరూ ఓ సినిమాకి పనిచేస్తారు. దానివల్ల వ్యాపారాన్ని పెద్దగా చేయటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దర్శక, నిర్మాతలు ఈ పద్ధతిని ఎన్నుకుంటారు. ఉదాహరణకు ‘సైరా’ చిత్రాన్ని తీసుకుందాం. ఆ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రను పోషిస్తే, ఆయనకు సపోర్ట్‌గా బాలీవుడ్‌ నుంచి బిగ్‌బీ అమితాబ్, కోలీవుడ్‌ నుంచి విజయ్‌ సేతుపతి, శాండల్‌వుడ్‌ స్టార్‌ సుదీప్‌లతో పాటు జగపతిబాబు, నయనతార, అనుష్క, తమన్నా  ఇలా చాలామంది స్టార్స్‌ నటించి దాన్ని పాన్‌ ఇండియా చిత్రంగా నిలిపారు. ‘సాహో’లో కూడా అనేక మంది బాలీవుడ్‌ నటులతో పాటు తమిళ నటులు కూడా నటించారు. ‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ‘సాహో’ చిత్రాన్ని పాన్‌ఇండియా సినిమాగా ప్రభాస్‌ విడుదల చేశారు.
 
తెలుగు హీరోలకు మంచిరోజులు 
మన తెలుగు సినిమా హీరోలకు ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో గిరాకీ పెరుగుతుంది. దీనంతటికి కారణం ‘బాహుబలి’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ సినిమాతో వచ్చిన వసూళ్లతో అంతర్జాతీయంగా ఒక తెలుగు సినిమాపేరుతో పాటు రాజమౌళి, ప్రభాస్, రానా పేర్లు మారుమోగాయి. దేశవ్యాప్తంగా విడుదల చేసేలా సినిమా తీస్తే, అప్పుడు ఖర్చుకు వెనుకాడకుండా తీయచ్చనేది చిత్రనిర్మాతల ఆలోచన. అలా తీస్తే పెట్టిన ప్రతిపైసా మొదటివారంలోనే వస్తుందనేది వారి నమ్మకం. చిరంజీవి, ప్రభాస్‌ల కోవలోనే అనేక మంది తెలుగు స్టార్స్‌ యన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, రానా, విజయ్‌ దేవరకొండలతో పాటు మరికొంతమంది తెలుగు స్టార్‌హీరోలు పాన్‌ ఇండియా మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

దేశమంతా సైరా...
80ల నాటి తెలుగు హీరోల్లో కొందరు హిందీ సినిమాలు చేశారు. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘అంకుశం’ చిత్రం హిందీ రీమేక్‌ ‘ప్రతిబం«ద్‌’ (1990)లో చిరంజీవి హీరోగా చేశారు. తానే నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ హిందీ రీమేక్‌ ‘ఆజ్‌కా గూండారాజ్‌’లోనూ, ‘ది జెంటిల్‌మెన్‌’ రీమేక్‌లో కూడా చిరంజీవి నటించారు. నాగార్జున, వెంకటేశ్‌ కూడా నేరుగా కొన్ని బాలీవుడ్‌ సినిమాలు చేసినవారే! ‘బాహుబలి’ తర్వాత చిరంజీవి నటించిన ‘సైరా’ను పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన రెండో తెలుగు సినిమాగా చెప్పుకోవాలి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ను కూడా పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్‌చరణ్‌ ఆలోచనట!

ముచ్చటగా మూడు సినిమాలతో..
ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ఇండియా మూవీ ‘సాహో’ చిత్రం బడ్జెట్‌ దాదాపు రూ.300 కోట్లు. ప్రాంతీయ భాష తెలుగులో ఈ సినిమాకు యావరేజ్‌ మార్కులు పడితే, బాలీవుడ్‌ జనాలు ఈ సినిమా చూసి ప్రభాస్‌కు ‘సాహో’ అన్నారు. కలెక్షన్‌లపరంగా ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపింది. మొదట ఈ సినిమాకు డివైడ్‌టాక్‌ వినిపించినా, తర్వాత రూ.400 కోట్ల మార్కును చేరుకోవటంతో ప్రభాస్‌ చేయబోయే కొత్త చిత్రాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం ప్రభాస్‌ మరో మూడు పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తున్నారు. అవన్నీ చాలా పెద్ద ప్రాజెక్టులుగా తయారు కాబోతున్నాయి.

అందులో ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని తమ సొంత బ్యానర్లు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘జిల్‌’ దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1940ల నాటి పిరియాడికల్‌ లవ్, రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ‘మహానటి’తో తన టాలెంట్‌ను నిరూపించుకున్న దర్శకుడు నాగ్‌అశ్విన్‌ తన తర్వాత కథను ప్రభాస్‌కు వినిపించారు. ప్రభాస్‌కు కథ నచ్చటంతో లాక్‌డౌన్‌లోనే ఈ సినిమాను లాక్‌ చేసేశారు నిర్మాత సి.అశ్వనీదత్‌. ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన స్వప్నా దత్, ప్రియాంకదత్‌ ఆయన కుమార్తెలే.

ప్రియాంకా దత్‌ భర్తే ‘మహానటి’ దర్శకుడు నాగ్‌అశ్విన్‌. ఆలస్యం చేయకుండా ‘మహానటి’ టీమ్‌తో చేతులు కలిపారు ప్రభాస్‌. బాలీవుడ్‌ దర్శకనిర్మాత ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ అనే మైథలాజికల్‌ చిత్రాన్ని ప్రభాస్‌ అంగీకరించారు. ఇందులో ఆయన రాముని పాత్రలో నటిస్తున్నారు. ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టీ–సిరీస్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఓం రౌత్‌. 2021లో షూటింగ్‌ ప్రారంభించి 2022లో ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. పాన్‌ ఇండియా రేస్‌లో ఈతరం తెలుగు హీరోల్లో మొదటిస్టార్‌గా ప్రభాస్‌ తన పేరు నమోదు చేసుకున్నారు. 

డబ్బింగ్‌–రీమేక్‌–ఓటీటీ
ఒక సినిమా కంటెంట్‌ బావుంటే అది ఏ భాషలో తీసినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సౌతిండియా సినిమాలు (తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ) దేశం మొత్తానికి ఈ రోజేం కొత్తకాదు. మొదట ఓ ప్రాంతీయ భాషలో విడుదలై విజయం సాధిస్తే తర్వాత కాలంలో ఇతర భాషల్లోకి డబ్బింగ్‌ చేయడం లేదా రీమేక్‌ చేయడం సినిమా తొలినాళ్ల నుంచి  వస్తున్నదే. సౌతిండియన్‌ డబ్బింగ్, రీమేక్‌ చిత్రాలకు 1970–80ల నుంచి డిమాండ్‌ పెరగింది. ఈ మధ్య కాలంలో సౌతిండియన్‌ సినిమాల్లో దాదాపు అన్నింటినీ హిందీలోకి డబ్‌ చేస్తున్నారు. ఆ విధంగా దక్షిణాది హీరోలందరూ హిందీ ప్రేక్షకులకు తెలిసిన ముఖాలే! ఈ విధంగా చేయటం దాదాపుగా 2010 నుంచి ఊపందుకుంది.

చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, రవితేజ, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, గోపీచంద్, రామ్‌చరణ్, రానా, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్, నాని, సాయిధరమ్‌ తేజలతో పాటు దాదాపు అందరు తెలుగు హీరోలకు హిందీ డబ్బింగ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఒక నూతన చిత్రం ప్రారంభమవుతుంది అని ఎనౌన్స్‌మెంట్‌ రాగానే అదేరోజు కోట్లు వెచ్చించి ఆ హీరో రేంజ్‌ను బట్టి సినిమాకు ఆఫర్లు ఇస్తున్నారు హిందీ డబ్బింగ్‌ సినిమా నిర్మాతలు. ఆ తర్వాత ఈ సినిమాలను వివిధ మాధ్యమాల ద్వారా టీవీల్లో చూడటానికి అందుబాటులో ఉంచుతున్నారు.

ఆ విధంగా భాషతో సంబంధం లేకుండా అందరు నటులు దేశమంతా ఇప్పుడు చిరపరిచితులే. కొత్తగా మూడు, నాలుగేళ్లుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో రాజ్యమేలుతున్నాయి. వీటి ద్వారా సినీ అభిమానులు అన్ని భాషల్లోని సినిమాలను వదిలి పెట్టకుండా చూస్తున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మన హీరోలందరికీ భవిష్యత్తులో పాన్‌ ఇండియా మార్కెట్‌ ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎటొచ్చి ఒక భాషలో సినిమాను విడుదల చేస్తే అయ్యే ఖర్చుకు దాదాపు మూడొంతుల అదనపు ఖర్చులు మార్కెటింగ్‌ రూపంలో ఎదురవుతాయి.

రామ్‌చరణ్‌–ఎన్టీఆర్‌
రామ్‌చరణ్‌ ‘జంజీర్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి 2013లోనే ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలోని ‘ముంబై కా హీరో...’ అనే పాటను కూడా పాడి హిందీలో తన ఆరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగులో ‘తుఫాన్‌’గా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆయన టాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాను రాజమౌళి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంతరించుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్, చెర్రీ పాన్‌ ఇండియా స్టార్స్‌గా మారతారు అనటంలో సందేహం లేదు.

అల్లు అర్జున్‌
అల్లు అర్జున్‌ సినిమాలన్నీ దాదాపు హిందీలోకి డబ్బింగ్‌ జరుపుకుని, కోట్లాది వ్యూస్‌ సాధిస్తున్న సంగతి తెలిసిందే. మారిన వ్యాపార సమీకరణాలతో లెక్కల మాస్టర్‌ సుకుమార్‌తో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నారు బన్నీ. ‘పుష్ప’ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా చిత్రీకరిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. గంధం చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు అర్జున్‌. రీసెంట్‌గా తాను హీరోగా నటించిన ‘అల..వైకుంఠపురంలో’ సినిమాను కోట్లాదిమంది వీక్షించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఇండియన్‌ టాప్‌టెన్‌ మూవీస్‌ లిస్ట్‌లో కొనసాగుతోంది. పాన్‌ఇండియా రేంజ్‌లో కూడా అల్లు వారబ్బాయి స్టైలిష్‌ స్టార్‌ అనిపించుకుంటాడో లేదో చూద్దాం మరి.

అహం బ్రహ్మస్మిః
మంచు మనోజ్‌ కొంతకాలం గ్యాప్‌ తీసుకుని చేస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మస్మిః’. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో చిత్రీకరణ జరుపుకుని పాన్‌ఇండియా సినిమాగా విడుదల చేస్తామని మనోజ్‌ ప్రకటించారు. హీరో ఆది సాయికుమార్‌ కూడా ఓ పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించాడు.

పాన్‌ ఇండియా దర్శకులు
సినిమా వ్యాపారాత్మకమైన కళ. ఓ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలని రూలేం ఉండదు. హీరో మార్కెట్‌ స్థాయిని బట్టి సినిమాకు డబ్బు ఖర్చు చేయటానికి చూస్తారు నిర్మాతలు. ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవడమే కొంత రిస్కుతో కూడిన వ్యవహారం. నిర్మాతలకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో మణిరత్నం తన సినిమాలను ఒకటికి మించిన భాషల్లో పలుచోట్ల విడుదల చేయడం ఇదివరకే ప్రారంభించారు. మరో తమిళ దర్శకుడు శంకర్‌ది కూడా ఇదే పంథా. ఎస్‌ఎస్‌రాజమౌళి, పూరీజగన్నాథ్, కొరటాలశివ, నాగఅశ్విన్, సుజిత్, రాధాకృష్ణ ఈ తెలుగుదర్శకులతో పాటు ఎంతోమంది తెలుగు దర్శకులు పాన్‌ ఇండియా బావుటా ఎగరవేయనున్నారు భవిష్యత్తులో.

కమల్‌–రజనీ 
దక్షిణ భారతవేశంలోని నటుల్లో మొదటి పాన్‌ ఇండియా స్టార్‌ కమల్‌హాసన్‌ అనే చెప్పాలి. కమల్‌ డైరెక్ట్‌గా తమిళంతో పాటు, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో నటించి ‘లోకనాయకన్‌’ బిరుదును సొంతం చేసుకున్నారు. గత 45ఏళ్లుగా హిందీ సినిమాల్లో  నటిస్తునే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భారతీయుడు’ సినిమా సీక్వెల్‌ చేస్తున్నారు. 
ఆయన కోవలోనే తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నార్త్‌లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. తాను శంకర్‌ దర్శకత్వంలో చేసిన ‘రోబో’, ‘శివాజీ’, ‘రోబో2’ చిత్రాలు పాన్‌ఇండియా సినిమాలే! ఇక నుంచి వీరద్దరివీ రిలీజ్‌ అవబోయే సినిమాలన్నీ పాన్‌ ఇండియాసినిమాలే...

విజయ్‌ దేవరకొండ
అతి తక్కువ కాలంలో తెరపైకి బుల్లెట్‌లా దూసుకొచ్చిన నటుడు విజయ్‌ దేవరకొండ. తన నటనతో, యాసతో చాలా తొందరగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బాలీవుడ్‌లో కూడా ఈయన పేరు అందరికీ పరిచయమే. షాహిద్‌ కపూర్‌ హీరోగా చేసిన ‘కబీర్‌సింగ్‌’ సినిమాకు మాతృక తెలుగు సినిమా ‘అర్జున్‌ రెడ్డి’ అని అక్కడి ప్రేక్షకులకు తెలుసు. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే ‘కబీర్‌సింగ్‌’నూ తెరకెక్కించారు. రెండుచోట్లా ఆ సినిమా పెద్దవిజయాన్ని నమోదు చేసుకుంది.  ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమా కూడా ఏకకాలంలో దేశమంతా విడుదలవ్వబోతోంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చార్మీ ‘ఫైటర్‌’ గురించి మాట్లాడతూ–ఇకపై తమ బ్యానర్‌లో నిర్మించే ప్రతిచిత్రాన్నీ పాన్‌ ఇండియా సినిమాగా తీస్తామని, ముఖ్యంగా పూరీ దర్శకత్వంలో వచ్చే అన్ని సినిమాలనూ దేశమంతా చూసేలా నిర్మిస్తామని అన్నారు. ‘ఫైటర్‌’గా విజయ్‌దేవరకొండ బాలీవుడ్‌లో ఇచ్చే ఎంట్రీ ఫైట్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాతో వచ్చే మార్కెట్‌ను బట్టి తన తర్వాత సినిమాలను పాన్‌ ఇండియా చిత్రాలుగా విజయ్‌ మార్చుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

రానా
రానా తెలుగు హీరోనే అయినా, అన్ని భాషల సినిమాల్లోనూ నటిస్తూ దేశమంతా తిరుగుతుంటారు. ‘బాహుబలి’ చిత్రంలో ఆయన పోషించిన భల్లాలదేవ పాత్రతో ప్రపంచం మొత్తం చుట్టేశారు. ‘హాథీ మేరే సాథీ’ అని హిందీలో ‘అరణ్య’ అని తెలుగులో రానా చేసిన పాన్‌ ఇండియా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే గుణశేఖర్‌ దర్శకుడిగా ‘హిర ణ్యకశప’ అనే మైథలాజికల్‌ కథతో ఓ సినిమా చేస్తున్నారు రానా. ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా విడుదల చేస్తారు. తన మరో చిత్రం ‘విరాటపర్వం’ సినిమాను మాత్రం తెలుగులోనే విడుదల చేస్తారట.

హీరోయిన్ల హవా
పాన్‌ ఇండియా సినిమాలనగానే హీరోయిన్ల హవా కూడా బాగానే ఉంటుంది. ‘బాహుబలి’లో అనుష్క, తమన్నాలు తమ పాత్రలతో కనువిందు చేసి ఔరా అనిపించుకున్నారు. ‘సాహో’ సినిమాతో తెలుగు సినిమాకి సూపర్‌ ఎంట్రీ ఇచ్చారు శ్రద్ధాకపూర్‌. ఆ చిత్రంలోనే స్పెషల్‌సాంగ్‌ ఎంట్రీ ఇచ్చి సినిమాకి రిచ్‌నెస్‌ను తీసుకొచ్చారు బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. ‘సైరా’ చిత్రంలోని ఎంట్రీసీన్‌ను, ఎండ్‌సీన్‌ను రుద్రమదేవి పాత్రలో అనుష్క మెరిపించగా, నరసింహారెడ్డి భార్య పాత్రను నయనతార, ప్రేయసి పాత్రను తమన్నా పోషించారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’సినిమాలోనూ, కమలహాసన్‌కి జోడీగానూ కాజల్‌ రెండు పాన్‌ఇండియా సినిమాల్లోనూ నటిస్తోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ రామరాజు పక్కన సీత పాత్రలో ఒదిగిపోవటానికి రెడీ అయ్యారు. విజయ్‌ దేవరకొండ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే నటిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ప్రభాస్‌ సినిమా ‘రాధేశ్యామ్‌’లో బాలీవుడ్, టాలీవుడ్‌కు పరిచితురాలైన పూజాహెగ్డే కాథానాయిక. రాబోయే చిత్రాల్లో నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేసే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌లో దీపికా పదుకొనేని ఎనౌన్స్‌ చేసింది చిత్రబృందం. అల్లు అర్జున్‌ సరసన రష్మికా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

  • తెలుగు సినిమా హీరోలందరూ ఇప్పుడిప్పుడే  పాన్‌ ఇండియా సినిమాల బాట పట్టారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో శుభపరిణామం. థ్యాంక్స్‌ టు ‘బాహుబలి’. అప్పట్లో మణిరత్నం తీసిన ‘రోజా’, ‘బొంబాయి’ పాన్‌ ఇండియా సినిమాలే. అలాగే శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కూడా చాలావరకు పాన్‌ ఇండియా చిత్రాలే. ఏదేమైనా ‘బాహుబలి’ చిత్రం గేమ్‌ చేంజర్‌ అని చెప్పాలి. - జాగర్లమూడి రాధాకృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement