పండగ అంటే చాలు.. సినిమాల అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు సినీ లవర్స్. మహాశివరాత్రి సినీ అభిమానులను సంతోషపెట్టింది. వెంకటేశ్‌ని యంగ్ లుక్‌లో చూపెట్టింది. ప్రేయసితో కలసి ప్రత్యక్షమయ్యారు ప్రభాస్. గోపీచంద్‌తో కలిసి తమన్నా సీటీ కొట్టారు. ‘హరిహర వీరమల్లు’ అన్నారు పవన్ కల్యాణ్. ఇంకా కొత్త పోస్టర్లు పండగకి విడుదలయ్యాయి. కొత్త లుక్స్‌పై లుక్కేద్దాం.
వెంకటేశ్ యువకుడిగాను, వృద్ధుడిగానూ కనిపించనున్న చిత్రం ‘నారప్ప’. తమిళ ‘అసురన్’కి రీమేక్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వృద్ధ లుక్ విడుదల కాగా పండగకు యంగ్ లుక్‌ని విడుదల చేశారు. డి. సురేష్‌బాబు, కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ సోలోగా వస్తే ప్రభాస్ తన ప్రేయసి పూజా హెగ్డేతో వచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధేశ్యామ్’లో ప్రభాస్, పూజా జంటగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది.
ఇక శివరాత్రి సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌తో వచ్చారు పవన్ కల్యాణ్. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేసి, లుక్‌ని విడుదల చేశారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. గోపీచంద్, తమన్నా సీటీ కొడుతూ సందడి చేశారు. ఈ ఇద్దరూ జంటగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ‘సీటీమార్’లోని తాజా ఫొటో విడుదలైంది. ‘అన్నం’.. పరబ్రహ్మ స్వరూపం అంటున్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. అరిటాకులో ‘అన్నం’ అనే అక్షరాలు, పక్కనే వేట కొడవలితో పోస్టర్‌ని విడుదల చేశారు.
శివరాత్రి శివుడి పండగ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరునే టైటిల్‌గా చేసుకుని ‘శివుడు’ అంటూ వచ్చారు ఆది పినిశెట్టి. సుశీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లుక్ విడుదలైంది. దర్శకుడు రవిరాజా పినిశెట్టి సమర్పణలో ఈ చిత్రాన్ని సత్యప్రభాస్ నిర్మిస్తున్నారు. భారీ చిత్రాలు నిర్మించే యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణంలో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. పవన్ తేజ, సూర్య శ్రీనివాస్, రూపిక ముఖ్య తారలుగా కుంచమ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఛిల్ బ్రో’ లుక్ వచ్చింది. ఇంకా పలు చిత్రాల లుక్స్ రిలీజయ్యాయి.
కొత్త సినిమాలపై ఓ లుక్కేద్దాం!
Published Fri, Mar 12 2021 1:27 AM | Last Updated on Fri, Mar 12 2021 9:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment