'టైగర్ నాగేశ్వరరావు' రియల్ స్టోరీ.. ఇంతకీ అతడెవరో తెలుసా? | Tiger Nageswara Rao Biography And Details Telugu | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao Details: 'టైగర్ నాగేశ్వరరావు' రియల్ స్టోరీ ఏంటి? అతడెవరు?

Published Thu, Aug 31 2023 4:39 PM | Last Updated on Fri, Oct 20 2023 5:11 PM

Tiger Nageswara Rao Biography And Details Telugu - Sakshi

'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని పేరు. మహా అయితే స్టువర్టుపురం గజదొంగ అని తెలిసి ఉంటుందేమో! ఇతడి జీవితం ఆధారంగా తెలుగులో ఓ సినిమా తీశారు. రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' పేరుతోనే దీన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇంతకీ 'టైగర్ నాగేశ్వరరావు' ఎవరు? ఆయన మంచోడా? చెడ్డోడా?

ఎవరీ నాగేశ్వరరావు?
విజయవాడ-చెన‍్నై రూట్‌లో బాపట్లకు దగ్గర్లో స్టువర్టుపురం అనే ఊరు ఉంటుంది. అప్పట్లో అంటే 1874 టైంలో దొంగల్ని, ఇతర నేరాలు చేసే వాళ్లపై నిఘా పెట్టేందుకు.. వాళ్లందరినీ తీసుకొచ్చి ఈ ఊరిలో నివాసం కల్పించారు. అలా దొంగతనాలు చేసుకునే కుటుంబంలో 1953-56 మధ్యలో నాగేశ్వరరావు పుట్టాడు. ఇతడికి ఇద్దరు అన్నలు ప్రసాద్, ప్రభాకర్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రసాద్, ప్రభాకర్ దొంగతనాలు చేసేవారు.

(ఇదీ చదవండి: టైగర్‌ నాగేశ్వరరావు టీజర్‌పై హైకోర్టు అసహనం)

అలా దొంగగా మారి
అయితే ఓ సారి ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు.. నాగేశ్వరరావుని స్టేషన్‌కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. చేయని నేరానికి చిత్రవధ అనుభవించిన ఇతడు.. తండ్రి, అన్నల బాటలో అది కూడా 15 ఏళ్లకే దొంగగా మారాడు. 1970లో తమిళనాడుకు వెళ్లిపోయి మారుపేర‍్లతో దొంగతనాలు చేశాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి బయటకొచ్చాక, అతడి గ్యాంగ్‌లో చేరిపోయాడు.

చెప్పి మరీ దొంగతనాలు
ఓసారి ఈ అన్నదమ్ముల్ని తమిళనాడులో తిరువళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తనని చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని.. నాగేశ్వరరావు సవాలు విసిరాడు. అన్న చెప్పినా సరే వినకుండా అలానే రెండు రోజుల తర్వాత జైలులో పోలీసులని కొట్టి మరీ పరారయ్యాడు. 'వచ్చే నెల మద్రాసులో దొంగతనం చేస్తాను, దమ్ముంటే పట్టుకోండి' అని సవాలు విసిరి మరీ దొంగతనాలు చేశాడు. దీంతో నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా మార్మోగిపోయాడు.

(ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు)

15 ఏళ్లపాటు దొంగతనాలు
పోలీసుల తీరు వల్ల దొంగగా మారిన టైగర్ నాగేశ్వరరావు.. దాదాపు 15 ఏళ్లపాటు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకలో దొంగతనాలు, దోపీడీలకు పాల్పడ్డాడు. పోలీసులని ముప్పతిప్పలు పెట్టాడు. 1974లో బనగానపల్లె బ్యాంకు దోపీడీ అయితే వేరే లెవల్. పోలీసు స్టేషన్ దగ్గరే ఉన్న ఆ బ్యాంక్‌ని నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది.

మత్తు మందు ఇచ్చి
అయితే నాగేశ్వరరావు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసులు.. అతడిని ఎలా అయినాసరే మట్టుబెట్టాలని ఓ మహిళతో కలిసి అతడిని చంపడానికి ప్లాన్ చేశారు. అలా 1980 మార్చి 24న తెల్లవారుజామున.. ఆ మహిళ ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు మత్తుమందు కలిపిన పాలు తాగాడు. అలా నిద్రపోతుండగా పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తర్వాత దాన్ని ఎన్‌కౌంటర్‌గా మార్చేశారు.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్)

దొంగనే కానీ మంచోడు
అయితే స్టువర్టుపురం గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు.. పెద్దోళ్ల దోచుకున్నదంతా పేదలకు పంచిపెట్టేవాడు. చదువు, పెళ్లి, వైద్యం లాంటిది ఏదైనా సరే అవసరానికి మించిన సహాయం చేసేవాడు. అయితే ఎ‍న్ని దొంగతనాలు, దోపీడీలు చేసినా సరే మహిళల పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడి అన్నయ్య ప్రభాకర్.. ఓ సందర్భంలో చెప్పాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్‌ అధికారి రిలేషన్‌.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement