ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. పెద్దలను కొట్టి పేదలకు పంచిన రాబిన్‌హుడ్‌గా ఫ్యాన్ పాలోయింగ్ కలిగిన నేరస్తుడు. పోలీసు అధికారులకు ముందుగా చెప్పి జైలు నుంచి తప్పించుకున్న ‘టైగర్’. పట్టుకోలేరంటూ సవాల్ చేసి మరీ నేరాలు చేసిన తెంపరి. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమాన జనంతో ఆయన అంతిమ యాత్రకు మూడు రోజులు పట్టింది. మృతి చెందిన 43 ఏళ్లకు నాగేశ్వరరావు జీవిత కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గజదొంగ హీరోయిజమే ఈ పాన్‌ఇండియా సినిమాకు ప్రేరణ. ‘మాస్ మహరాజ్’ రవితేజ ఈ చిత్ర హీరో.
గుంటూరు డెస్క్ : విజయవాడ– చైన్నె రైలు మార్గంలో బాపట్ల సమీపంలో ఉంటుంది స్టువర్టుపురం. 1874 సెటిల్‌మెంట్ చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామం. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారిని, ఇతర నేరస్తులను గుర్తించి నిఘా ఉంచేందుకని ఇక్కడ నివాసం కల్పించారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్ పేరుతో గ్రామానికి నామకరణం చేశారు. నేరాల్లో ఆరితేరిన వారు ముఠాలుగా వివిధ రాష్ట్రాల్లో దోపిడీ, దొంగతనాలకు పాల్పడేవారు. స్టువర్టుపురం దొంగలంటేనే జనంలో ఒకరకమైన భీతి ఉండేది. టైగర్ నాగేశ్వరరావు తెర పైకి వచ్చాక ఆ గ్రామం పేరు మరింతగా కలకలం రేపింది. తోటి దొంగలకు హీరోగా, పేదలకు ఆపద్బాంధవుడిగా, పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.
దొంగతనాలు వారసత్వంగా కలిగిన కుటుంబంలో ఇద్దరు అన్నల తర్వాత గరిక నాగేశ్వరరావు జన్మించాడు. జనన సంవత్సరం 1953–56 మధ్య. సోదరులు ప్రసాద్, ప్రభాకర్. వీరి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. మరికొన్నేళ్లకు తండ్రినీ కోల్పోయారు. తండ్రి బాటలోనే దొంగతనాలు చేస్తున్న ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు, సోదరుడైన నాగేశ్వరరావును తీసుకెళ్లి, తీవ్రంగా హింసించారు. ఏ నేరం చేయకుండానే పోలీసుల చిత్రహింసలు అనుభవించిన 15 ఏళ్ల నాగేశ్వరరావు తండ్రి, అన్న బాటలోనే నేరస్తుల జత కట్టాడు. 1970లో తమిళనాడు వెళ్లి మారుపేర్లతో నివాసముంటూ దొంగతనాలు ఆరంభించాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి విడుదలై వచ్చాక అతడి ముఠాలో పని చేయసాగాడు.
‘ఆంధ్రా టైగర్‌రా’...
ఒక పర్యాయం తమిళనాడు పోలీసులు అన్నదమ్ములను అరెస్టు చేశారు. తిరువాళ్లూరు జైలులో ఉన్న నాగేశ్వరరావును అప్పటి ఐజీ అరుళ్ విచారించారు. తనను చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని నాగేశ్వరరావు ఐజీతో స్పష్టంగా చెప్పాడు. అన్న వద్దని చెప్పినా వినకుండా, సబ్‌జైలు నుంచి పోలీసులను కొట్టి మరీ పరారయ్యాడు. తనను వెతుక్కుంటూ స్టువర్టుపురం వచ్చిన పోలీసులనూ కొట్టాడు. ‘వచ్చే నెలలో మద్రాస్ సిటీలోనే నేరం చేస్తాను... దమ్ముంటే పట్టుకోమను’ అంటూ వారిని పంపేశాడు. అన్నట్టుగానే మద్రాస్ సిటీలో వరుసగా మూడు నెలలు దొంగతనాలు చేసి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. విసుగెత్తిపోయిన ఐజీ అరుళ్ నిజంగా వాడు ‘ఆంధ్రా టైగర్‌రా’ అన్నాడు.
అప్పట్నుంచి నాగేశ్వరరావు ఇంటి పేరు టైగర్ అయింది. ఏపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 15 ఏళ్లపాటు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన టైగర్ నాగేశ్వరరావు పోలీసులకు సింహస్వప్నంగా మారాడు. 1974లో జరిగిన బనగానపల్లె బ్యాంకు దోపిడీ అందులో ఒకటి. పోలీస్‌స్టేషనుకు అత్యంత సమీపంలో ఉండే బ్యాంకును నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. సేఫ్‌ను పగులగొట్టి వెంట తీసుకెళ్లారు. గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులకు ప్రభాకరరావు దొరికాడు మినహా నాగేశ్వరరావు ఆచూకీ దొరకలేదు. ఒక బిస్కట్ కంపెనీ అధినేత, అప్పటి హోంశాఖ సహాయమంత్రి వియ్యంకుడి కుటుంబాన్ని దారికాచి దోచారు.
పట్టుకునేందుకు పోలీసుల వ్యూహం ...
తలనొప్పిగా మారిన నాగేశ్వరరావును ఎలాగైనా మట్టుపెట్టాలని పోలీస్ శాఖలోని కొందరు అధికారులు సిద్ధమయ్యారు. మరొక దొంగ ఇచ్చిన సమాచారంతో నాగేశ్వరరావు తరచూ ఒక మహిళ ఇంటికి వచ్చి వెళుతుంటాడని తెలుసుకున్నారు. డబ్బాశ చూపారు. పాలల్లో మత్తుమందు కలిపి, తమకు సంకేతం ఇవ్వాలని, లేకుంటే తనను చంపేస్తామని బెదిరించారు. భయపడిపోయిన ఆ మహిళ తర్వాత నాలుగు రోజులకు 1980 మార్చి 24న తెల్లవారుజామున ఇంటికి వచ్చిన నాగేశ్వరరావుకు పోలీసులు చెప్పినట్టే మత్తుమందు కలిపిన పాలు తాగించింది. మత్తులో నిద్రపోతున్న అతడిపై పోలీసు అధికారి తుపాకీ కాల్పులు జరిపాడు. ఎన్‌కౌంటరులో హతమైనట్టు ప్రకటించారు. శవపరీక్ష నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి ఆరంభమైన అంతిమయాత్ర స్టువర్టుపురం కాలనీకి చేరేందుకు మూడురోజులు పట్టిందట! మూడు రాష్ట్రాల్నుంచి ఎందరో అభిమానులు ఆ యాత్రలో పాల్గొన్నారు.
చదువులు, వైద్యం, పెళ్లిళ్లకు సాయం ...
ఇన్ని దొంగతనాలు, దోపిడీలు చేసినా నాగేశ్వరరావు మిగుల్చుకుంది ఏమీ లేదంటారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు చీరాల, చుట్టుపక్కల పల్లెల్లోనే తలదాచుకునే వాడు. ఆశ్రయం ఇచ్చినవారికి, సహాయం కోరిన ఇతరులకు ఆర్థిక సహాయం చేసేవాడు. ముఖ్యంగా పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిళ్లకు తప్పకుండా సాయం చేసేవాడు. పొగాకు కంపెనీ యజమాని అరాచకంపై మహిళల్ని పోరుబాటకు సిద్ధం చేయటమే కాదు... అతడికి వత్తాసుగా వచ్చిన ఎస్‌ఐపైనా మహిళలతో దాడి చేయించాడు.
మహిళలంటే గౌరవం...
మేం ఒకప్పుడు దొంగతనాలు చేసినా, మహిళలంటే మాకెంతో గౌరవం...ఒంటరిగా ఉన్నా బంగారం, డబ్బు దోచుకునేవాళ్లం మినహా ఎలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్లం కాదు... నేటికాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలు వింటుంటే బాధ కలుగుతోంది. నా సోదరుడు నాగేశ్వరరావు ఆర్థికసాయం కూడా చేసేవాడు. సినిమా తీస్తున్నారు. నన్ను కూడా వివరాలు అడిగారు.
– గరిక ప్రభాకరరావు, నాగేశ్వరరావు సోదరుడు
సుదీర్ఘ పరిశోధన చేశాం...
‘దొంగాట’ సినిమా చేసేటపుడు ఒక పెద్దాయన ద్వారా టైగర్ నాగేశ్వరరావు గురించి తెలిసింది. దొంగైనా అతడు రాబిన్‌హుడ్ అని చెప్పటంతో ఆసక్తి కలిగింది. వైవిధ్యమైన సినిమాలు, అందులోనూ ఏదైనా బయోపిక్ కూడా తీయాలనుకున్న నాకు, అతడి జీవితంలోని కమర్షియల్ ఎలిమెంట్ నచ్చింది. అప్పట్నుంచి పరిశోధన మొదలైంది. ఎన్నో ఆసక్తిదాయకమైన అంశాలతో సినిమా తీస్తున్నాం.
– వంశీకృష్ణ, సినీదర్శకుడు
Comments
Please login to add a commentAdd a comment