సినిమాని జనరల్‌గా మేల్ లీడ్ చేస్తుంటారు. ఫిమేల్ లీడ్ చేయడం తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో లేడీస్ లీడ్ చేసే సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు హీరోల సరసన రెగ్యులర్ చిత్రాల్లో నటించడంతో అటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు కొందరు కథానాయికలు. స్టోరీని లీడ్ చేస్తున్న ఆ లీడ్ లేడీస్ గురించి తెలుసుకుందాం.
ప్రతీకారం కేసు పెడదామంటే..
‘అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత అనుష్క తెలుగులో కమిటైన చిత్రమిది. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ‘ఘాటీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట క్రిష్. బిజినెస్ ఉమన్‌గా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఆంధ్రా– ఒడిశా బోర్డర్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
శివశక్తిగా...
తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. 2021లో విడుదలై, హిట్‌గా నిలిచిన ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన కెరీర్‌లో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్, పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది.
సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘ఓదెల 2’ ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలోని ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. తన దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ సినిమాలో హీరోయిన్‌గా తమన్నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది ‘ఓదెల 2’లో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, మురళీ శర్మ, నాగమహేశ్, గగన్ విహారి వంటివారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
బంగారు బొమ్మ
‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత సమంత నటించనున్న తాజా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన బర్త్ డే (ఏప్రిల్ 28న) సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు సమంత. తన సొంత డైరెక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. తెలుగులో ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె అంగీకరించిన చిత్రం ఇదే. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పటిదాకా నటిగా మంచి విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
డబుల్ ధమాకా
హీరోయిన్ రష్మికా మందన్నా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు ‘పుష్ప 2: ది రూల్’, ‘కుబేర’, ‘సికందర్’, ‘ఛావా’, వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్, ధనుష్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వంటి హీరోలకి జోడీగా నటిస్తూ దూసుకెళుతున్న ఈ బ్యూటీ మరోవైపు ‘రెయిన్‌బో’, ‘ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్‌బో’లో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు.
అదేవిధంగా ‘చిలసౌ’ (2018) సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ది గాళ్ ఫ్రెండ్’. ఈ మూవీలోనూ రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక కళాశాల విద్యార్థి పాత్ర చేస్తున్నారని సమాచారం. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
మహిళల పరదా
పక్కింటి అమ్మాయి, హోమ్లీ గర్ల్ ఇమేజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ ‘రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్’ సినిమాలతో రూట్ మార్చారు. గ్లామరస్‌గా కనిపించడంతో పాటు ముద్దు సీన్స్‌లోనూ నటించి ఆశ్చర్యపరిచారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి ‘పరదా’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మహిళల చుట్టూ సాగే కథతో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది.
ఓ భక్తురాలి కథ
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో ఎమ్‌ఎస్‌కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘‘ఆదిపర్వం’ ఓ అమ్మవారి కథ. అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఎర్రగుడి నేపథ్యంలో దైవానికి, దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. 1974 నుంచి 1992 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మంచు లక్ష్మి నటన సరికొత్తగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
సరికొత్త థ్రిల్లర్
మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. తెలుగులో ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలు తీసిన నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి యోగేష్ కేఎంసీ దర్శకుడు.
ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది ఈ చిత్రకథ’’ అని సంయుక్తా మీనన్ తెలిపారు.
కుమారి ఖండం నేపథ్యంలో..
హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు శ్రద్ధా దాస్. ఆమె లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ట్యాగ్‌లైన్. మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘భారీ బడ్జెట్‌తో ఫ్యాంటసీ, హారర్ మూవీగా ‘త్రికాల’ రూపొందింది. కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాం. పురాణ నేపథ్యంతో సాగే ఈ మూవీలో విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
హత్యలు చేసిందెవరు?
ప్రియమణి లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘క్యూజి: కొటేషన్ గ్యాంగ్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వివేక్ కుమార్ కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్ , సారా అర్జున్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిలింస్ అధినేత ఎం.వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ‘‘మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘క్యూజి: కొటేషన్’ గ్యాంగ్’ రూపొందింది. ముంబై, కశ్మీర్, చెన్నై ప్రాంతాల మధ్య కిరాయి హత్యలు చేసే గ్యాంగ్‌లకు సంబంధించిన కథ ఇది. ఒక హత్య కేసు ఈ మూడు ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. అది ఏంటి అనేది సస్పెన్స్. నాలుగు స్టోరీలు, మూడు ప్రాంతాల్లో సాగుతాయి. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
ఇదిలా ఉంటే... హీరోయిన్లు నయనతార, కీర్తీ సురేష్. శ్రుతీహాసన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి వారు తమిళ భాషల్లో ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment