సినిమా అంటే కొన్ని పరిమితులుంటాయి. వెబ్ సిరీస్‌లకు హద్దులు లేవు. రొమాన్స్, వయొలెన్స్, సెంటిమెంట్.. ఏదైనా కొంచెం ఓవర్‌గా చూపించొచ్చు. ఈ నేపథ్యంలో సినిమా స్టార్స్ తమ ఇమేజ్‌కి భిన్నమైన క్యారెక్టర్లు, కథలు ఒప్పుకుని వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది వెబ్ వరల్డ్‌లోకి వేంచేసిన స్టార్స్ గురించి తెలుసుకుందాం.
► ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ హీరోలలో ఒకరైన వెంకటేశ్ ఓటీటీ వరల్డ్ కోసం కొత్త ట్రాక్‌లోకి వచ్చారు. కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్ ’ ఆధారంగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తీశారు దర్శక ద్వయం సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ . వెంకటేశ్‌తో పాటు రానా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుచిత్రా పిళ్లై కీలక పాత్రలు చేశారు.
కథ విషయానికొస్తే.. సెలబ్రిటీల సమస్యలను పరిష్కరించే రానా నాయుడు (రానా)కు అతని తండ్రి నాగ నాయుడు (వెంకటేశ్) అంటే ద్వేషం. పదిహేనేళ్ల జైలు జీవితం తర్వాత తిరిగొచ్చిన నాగ నాయుడుతో రానా నాయుడు తిరిగి కలుస్తాడా? నాగ నాయుడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అనే అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది. పది ఎపిసోడ్ల ఈ సిరీస్‌కి డైలాగ్స్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ఈ ఏడాది మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ‘రానా నాయుడు’ సెకండ్ సీజన్ కూడా ఉంటుంది.
► ‘దూత’గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. ఆయన హీరోగా ‘మనం’, ‘థ్యాంక్యూ’ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ‘దూత’కు దర్శకుడు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా సాగే ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియాభవానీ శంకర్, పశుపతి కీలక పాత్రలు పోషించారు. పాత్రికేయ విలువల కన్నా ధనమే ముఖ్యమని భావించే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ వర్మ (నాగచైతన్య పాత్ర) ‘సమాచార పత్రిక’కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. సాగర్‌కు దొరికే పేపర్ క్లిప్పింగ్‌లో ఉన్నవారు చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాగర్ ఏం చేశాడు? అన్నది ‘దూత’ సిరీస్‌లో చూడొచ్చు. డిసెంబరు 1 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
► ‘హనుమాన్ జంక్షన్ ’, ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో..’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపీ గోపికా గోదావరి’ వంటి సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వెండితెరపై కాస్త స్లో అయిన వేణు డిజిటల్ తెరపై సత్తా చాటాలని హారర్ థ్రిల్లర్ జానర్‌లో సాగే ‘అతిథి’ వెబ్ సిరీస్‌లో నటించారు. అవంతికా మిశ్రా, అదితీ గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. వైజీ భరత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్స్‌గా సాగుతోంది. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం సాగే దెయ్యాల మిట్ట అనే ప్రాంతానికి సమీపాన సంధ్య నిలయం అనే పెద్ద భవంతిలో రచయిత రవివర్మ (వేణు తొట్టెంపూడి), అతని భార్య సంధ్య (అదితీ గౌతమ్) నివసిస్తుంటారు.
అయితే దెయ్యాలు లేవని నమ్మే యూట్యూబర్ సవారి (వెంకటేశ్ కాకుమాను) అక్కడికి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని ఘటనలకు భయపడి సంధ్య నిలయంకు వెళ్తాడు. తన కంటే ముందే సంధ్య నిలయంకు వచ్చిన మాయ (అవంతిక మిశ్రా) చనిపోతుందని తెలుసుకుంటాడు సవారి. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా దెయ్యాల మిట్టలో దెయ్యాల సంచారం ఉందా? మాయ చావుకు కారణం ఎవరు? ఫైనల్‌గా సవారి ఏం తెలుసుకుంటాడు? అన్నది క్లుప్తంగా ‘అతిథి’ సిరీస్ కథ. ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
► నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది వెబ్ వరల్డ్‌లో డబుల్ ధమాకా ఇచ్చారు జేడీ. ఆయన టైటిల్ రోల్ చేసిన వెబ్ సిరీస్ ‘దయా’. ఈ సిరీస్‌కు పవన్ సాధినేని దర్శకుడు. ఈషా రెబ్బా, పృథ్వీరాజ్, రమ్యా నంబీసన్ , కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించారు. చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ దయా (జేడీ చక్రవర్తి). అతని భార్య అలివేలు (ఈషా రెబ్బా) నిండు గర్భిణి. ఓ రోజు దయా పని మీద కాకినాడకు బయలుదేరతాడు.
అయితే తన వ్యాన్ లో శవం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. ఆ శవం దయా బండిలోకి ఎందుకు వచ్చింది. ఈ ఘటనకు, జర్నలిస్ట్ కవిత (రమ్యా నంబీసన్)కు సంబంధం ఏంటి? అనేది సిరీస్‌లో చూడాలి. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జేడీ చక్రవర్తి ఓ ముఖ్య పాత్రలో నటించిన మరో వెబ్ సిరీస్ ‘తాజా ఖబర్’ జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
► ఆది సాయికుమార్ నటించిన వెబ్ సిరీస్ ‘పులిమేక’. ఈ సిరీస్‌కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకుడు. లావణ్యా త్రిపాఠి ఓ లీడ్ రోల్ చేశారు. కథ విషయానికొస్తే...హైదరాబాద్‌లో జరుగుతున్న పోలీసుల వరుస హత్యల మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగుతారు కిరణ్ ప్రభ (లావణ్యా త్రిపాఠి). ఫోరెన్సిక్ హెడ్ ప్రభాకర్ శర్మగా పోలీ సులకు హెల్ప్ చేస్తుంటాడు ఆది సాయికుమార్. మరి.. కిల్లర్‌ను కిరణ్ ప్రభ పట్టుకున్నారా? అతను పోలీసులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అనేది ‘పులి మేక’ సిరీస్ కథాంశం. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment