మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది సోనమ్. త్రిదేవ్, విశ్వాత్మ, అజూబా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అర్ధాంతరంగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన సోనమ్ దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రీఎంట్రీకి రెడీ అయ్యింది. ఓ ఓటీటీ షోతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోనమ్.. సినిమాలు వదిలేయడానికి గల కారణాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
► లాక్‌డౌన్‌లో ఓటీటీలో షోలు, సిరీస్‌లు చూశాను. ఇలాంటివి నేనెందుకు చేయకూడదు అనిపించింది. వెంటనే నా శరీరంపై దృష్టి పెట్టాను. ముప్పై కిలోలు తగ్గాను. నన్ను నేను మెరుగుపపర్చుకున్నాను. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యాను. 32 సంవత్సరాల తర్వాత మళ్లీ నటనారంగంలోకి వస్తుంటే కొంత సంతోషంగా మరికొంత భయంగానూ ఉంది.
► 1997లో ఇండియా వదిలివెళ్లిపోయాను. పద్నాలుగేళ్లకే పని చేయడం ప్రారంభించా. 19వ ఏటనే గర్భం దాల్చాను. జీవితంలో కష్టసుఖాలెన్నో చూశాను. లైఫ్ అన్నాక అన్నింటినీ దాటుకుంటూ పోవాలి కదా.. కానీ ఇప్పటికీ నేను ఇండస్ట్రీకి తిరిగి రావాలని కోరుకుంటుంటే హ్యాపీగా ఉంది.
► మంచి కథ దొరికితే దానికి తగ్గట్లు ఎలాంటి పాత్రనైనా చేస్తా. 50 ఏళ్లకే వయసైపోలేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మహిళలకు చాటిచెప్పాలని ఉంది. ఎందుకంటే యాభై ఏళ్లు వచ్చాయంటే మహిళలు వారు అప్పటిదాకా ఉన్న ఐడెంటిటీని కోల్పోతున్నారు. నేనేమీ నా ముడతలను చూసి భయపడట్లేదు. నా లుక్స్‌కు తగ్గట్లు పాత్రలు వస్తే అలానే నటిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment