టాలీవుడ్ డైరెక్టర్స్‌లో ఆయన స్టైలే వేరు. ఆయన పేరు వింటే చాలు సినిమాల్లోని డైలాగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. అందరిలా కేవలం డైరెక్షన్ చేయడమే కాదు.. కథ, మాటల రచయితగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ చేసిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమాల్లో పాత్రల కంటే.. ఆయన రాసిన మాటలు, డైలాగ్స్ మాత్రమే మనకు గుర్తుంటాయి. జంధ్యాల, ముళ్లపూడి లాంటి మహానుభావుల్లాగే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఉందని నిరూపించాడు. తన సినిమాల్లో తన పంచ్ డైలాగ్‌లతో నిజ జీవితంలోని సంఘటలను సున్నితంగా తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనకే సొంతం. రచయితగా మొదలైన సినీ ప్రస్థానం.. స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన తీరు చూస్తే ఆయనేంటో అర్థమవుతుంది.
అంతలా టాలీవుడ్‌లో తన డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తోన్న ఆ లెజెండరీ డైరెక్టర్ ఎవరో కాదు.. మన త్రివిక్రమ్ శ్రీనివాసుడే. నువ్వే నువ్వే చిత్రం నుంచి ఇప్పటి గుంటూరు కారం వరకు ఆయన ప్రయాణం మరిచిపోలేని జ్ఞాపకం. 1971 నవంబరు 7 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన ఆకెళ్ల నాగ శ్రీనివాస్.. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌గా పేరు సంపాదించారు.
స్వయంవరం సినిమాతో రచయితగా త్రివిక్రమ్ జర్నీ మొదలైంది. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు కథ, మాటల రచయితగా పనిచేశారు. అయితే తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మహేశ్ బాబుతో తీసిన అతడు సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవ లాంటి హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో గుంటూరు కారం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. నవంబర్ 7న మాటల మాంత్రికుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన కలం నుంచి దూసుకొచ్చిన టాప్ టెన్ డైలాగ్స్ గురించి తెలుసుకుందాం.
త్రివిక్రమ్ టాప్ డైలాగ్స్
1. సన్ ఆఫ్ సత్యమూర్తి - 'మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి... కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్'
2. జులాయి - 'మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు.. మనకి రాని పని ట్రై చేయకూడదు'
3. జులాయి - 'లాజిక్‌లు ఎవరు నమ్మరు.. అందరికి మ్యాజిక్‌లే కావాలి.. అందుకే మన దేశంలో సైంటిస్ట్‌ల కన్నా బాబాలే ఫేమస్'
4. నువ్వు నాకు నచ్చావ్ - 'మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి.. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.'
5. అల వైకుంఠపురములో- 'నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. కానీ చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది'
6. నువ్వే నువ్వే - 'సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు.. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు'
7. అరవింద సమేత వీరరాఘవ - 'పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?'
8. జల్సా - 'అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే.. మనం చేసే యుద్ధానికి అర్థమేముంది'
9. అత్తారింటికీ దారేది - 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు'
10. తీన్ మార్ - 'కారణం లేని కోపం.. గౌరవం లేని ప్రేమ.. బాధ్యత లేని యవ్వనం.. జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం'
Comments
Please login to add a commentAdd a comment