పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఎక్కువ లాభపడింది తెలుగు సినిమానే! బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, హనుమాన్, కల్కి 2898 ఏడీ సినిమాలు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ అదరగొట్టాయి. కన్నడ మూవీ కేజీఎఫ్ కూడా ఆలిండియా స్థాయిలో అదరగొట్టింది.
వెనకబడ్డ మలయాళ మూవీస్
అయితే మలయాళ చిత్రాలు (Malayalam Movies) మాత్రం ఆ స్థాయి రేంజ్‌ను అందుకోలేకపోతున్నాయి. అన్ని చోట్లా పెద్ద పెద్ద స్టార్స్‌ను హీరోగా పెట్టి సినిమాల్ని ముందుకు తీసుకువెళ్తే మలయాళంలో మాత్రం కంటెంటే కింగ్ అని, దాని వల్లే కాస్త వెనకబడ్డామంటున్నాడు హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan). హిందీలో మార్కెట్ లేకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుతూ.. మా దగ్గర బడ్జెట్ అనేది ప్రధాన సమస్య. ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారు. ఇంతకుముందెవరైనా ఎక్కువ పెట్టుబడితో హిట్ కొట్టారా? అని ఉదాహరణలు వెతుకుతారు.
స్క్రిప్ట్, హీరో.. ఇంకా!
సినిమా కమర్షియల్‌గా హిట్ కావాలంటే అందులో యాక్షన్ ఉండాల్సిందే! ఎందుకంటే యాక్షన్ సినిమాల్ని చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడతారు. అలాంటి యాక్షన్ కథా చిత్రాన్ని తీయాలంటే ముందుగా ఒక స్టార్ హీరో కావాలి. అందరూ మెచ్చేటువంటి బలమైన స్క్రిప్ట్ కావాలి. సినిమాను భారీ ఎత్తున నిర్మించే అద్భుతమైన నిర్మాత కావాలి. ఇలా చాలా అంశాలు అనుకూలిస్తేనే అది సాధ్యమవుతుంది అని ఉన్ని ముకుందన్ చెప్పాడు.
గతేడాది రూ.700 కోట్ల నష్టం
2024లో పలు మలయాళ సినిమాలు సక్సెస్‌ను చూశాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మలయాళ ఇండస్ట్రీకి నష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఈ మేరకు ఓ నివేదికను కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కేవలం 26 మాత్రమే హిట్టయ్యాయి. ఓవరాల్‌గా అన్ని సినిమాలు తెరకెక్కించేందుకు అయిన ఖర్చు రూ.1000 కోట్లు అయితే అందులో రూ.300 కోట్లు మాత్రమే కలెక్షన్ల రూపంలో వెనక్కు వచ్చాయి. ఈ లెక్కన మలయాళ ఇండస్ట్రీ రూ.700 కోట్లు పోగొట్టుకుంది. హిట్ సినిమాల జాబితాలో మంజుమ్మల్ బాయ్స్, ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), ఆవేశం, ప్రేమలు, ఏఆర్‌ఎమ్, కిష్కింద కాండం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం సినిమాలున్నాయి.
కేరళవాసి.. ఆ సినిమాతో క్లిక్
ఉన్ని ముకుందన్ విషయానికి వస్తే.. కేరళలో పుట్టి పెరిగిన ఇతడు సీడన్ (2011) అనే తమిళ సినిమాతో కెరీర్ ఆరంభించాడు. అదే ఏడాది బాంబే మార్చి 12 మూవీతో తన మాతృక భాష మలయాళంలో ఎంట్రీ ఇచ్చాడు. మల్లు సింగ్ మూవీతో సెన్సేషన్ అయిన ఉన్ని.. విక్రమాదిత్య, కేఎల్ 10 పట్టు, స్టైల్, ఒరు మురై వంతు పార్థాయ, అచయన్స్, మాలికాపురం చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు.
తెలుగులోనూ..
తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఇటీవలే మార్కోతో హిట్ అందుకున్న అతడు గెట్ సెట్ బేబీ అనే సినిమా చేస్తున్నాడు. 2022లో మెప్పడియాన్ మూవీతో ఉత్తమ నిర్మాతగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నాడు. ఈయన చివరగా మార్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వయొలెన్స్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మూవీకి హిట్ టాక్ రావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment