
రామ్‌చరణ్ నీడలో ఉండటం సంతోషంగా ఉందంటోంది ఉపాసన. తన భార్య మంచి ఇల్లాలని, తను చేసే గొప్ప పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయంటున్నాడు రామ్‌చరణ్. మార్చి 8న ఉమెన్స్ డే. ఈ సందర్భంగా చరణ్ దంపతులు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముందుగా ఉపాసన మాట్లాడుతూ.. 'మా ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు కావడంతో పెళ్లవగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లనిపించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. తనకు నీడగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నాను. పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
ఆత్మవిశ్వాసంతో పెంచారు
మా తాతయ్య స్త్రీ మూర్తులను ఎక్కువగా పూజించేవారు. మా అమ్మవాళ్లను ఎంతో ఆత్మవిశ్వాసంతో పెంచారు. మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఇది స్త్రీ లోకం అని భావించే ఇంట్లో నేను పుట్టిపెరిగాను అని చెప్పుకొచ్చింది. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ఉపాసన కేవలం నా భార్య కావడం వల్లే గుర్తింపు రాలేదు. తను చేసే మంచి పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. పలు రంగాల్లో తనకు ప్రావీణ్యం ఉంది. ఇంట్లో కుటుంబంతో ఉన్నా లేదా ఏదైనా ప్రాజెక్టుల ద్వారా పలువురికి సేవ చేయాలన్నా ఎంతో నిబద్ధతగా వ్యవహరిస్తుంది. వారసత్వాన్ని ఎంతో అందంగా ముందుకు తీసుకెళ్తుంది అని పేర్కొన్నాడు.
ఆలోచనల్లో మార్పు రావాలి
పిల్లలు పుట్టగానే చాలామంది ఉద్యోగాలు మానేస్తుంటారు? ఎందుకిలా అన్న ప్రశ్నకు ఉపాసన మాట్లాడుతూ.. ఒకసారి తల్లయ్యాక మునుపటిలా పని చేయడం కత్తిమీద సాములాగే ఉంది. ఎంత ప్రయత్నించినా పని చేయడం కష్టమవుతోంది.. చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ముందు ఈ ఆలోచనా ధోరణి మారాలి. అలాగే కంపెనీల్లో కూడా మహిళలకు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పుచేర్పులు చేయాలి. మెటర్నటీ లీవ్స్.. మహిళలు వారి అవసరాలకు తగ్గట్లు తీసుకునేలా అవకాశం కల్పించాలి. దీని గురించి ఇప్పటికే నేను కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నాను.
పిల్లలు తర్వాత అనుకునేవారు..
ముఖ్యమైన విషయం ఏంటంటే? ఆడవాళ్లు వారి ఎగ్స్‌ను కాపాడుకోవాలి. వాటిని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. జీవితంలో సెటిలవ్వాలి, తర్వాతే పిల్లల కోసం ప్రయత్నిద్దాం అనుకునేవారు వారి ఎగ్స్(అండాలు) దాచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇప్పుడు పిల్లల్ని కనొచ్చు అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ మీకు ఉపయోగపడతాయి. ఈ విధానం మహిళలకే కాదు దేశ పురోగతికి సైతం సాయపడుతుంది. నేను కూడా నా ఎగ్స్ దాచుకున్నాను. కరెక్ట్ సమయమిదే అనిపించినప్పుడే క్లీంకారను కన్నాం' అని తెలిపింది.
చదవండి: ప్రీవెడ్డింగ్.. ఖాన్స్ త్రయంతో పాటు రామ్‌చరణ్‌కు భారీగానే ముట్టిందా?
Comments
Please login to add a commentAdd a comment