Vamsidhar Goud And Lakshmi Narayana Interesting Comments On First Day First Show Movie - Sakshi
Sakshi News home page

First Day First Show Movie: పవన్‌ కల్యాణ్‌ని వాడుకున్నాం.. సర్‌ప్రైజింగ్‌ ఉంటుంది

Published Wed, Aug 17 2022 5:18 PM | Last Updated on Wed, Aug 17 2022 7:30 PM

Vamsidhar Goud, Lakshmi Narayana Talk About First Day First Show Movie - Sakshi

‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ లాంటి సినిమాలను అందించిన సంస్థ పూర్ణోదయ మవీ క్రియేషన్స్‌. దీని అనుబంధ సంస్థ శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌డే ఫస్ట్‌ షో’.  మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు.. 

`ఫస్ట్ డే ఫస్ట్ షో` కథ ఎలా ఉండబోతుంది ? 
వంశీ : ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్‌. కాలేజీలో ఒక  అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత శ్రీనుతో తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా `ఫస్ట్ డే ఫస్ట్ షో` టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్ల సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా ఎంటర్ టైనింగ్  ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. హీరో గోల్.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం. ఆ గోల్ ని రీచ్ అయ్యే క్రమంలో చాలా సర్ ప్రైజులు ఉంటాయి. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. 

ఇద్దరు దర్శకులని తీసుకోవడానికి కారణం  ?
వంశీ : 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ చాలా ఎక్సయిట్ చేసింది. దర్శకుడిగా లాంచ్ అవ్వడం కంటే కథని అద్భుతంగా తీయాలనే ఆలోచనపైనే దృష్టి ఉండేది. ఫస్ట్ టైం డైరెక్టర్ గా నాకు అంత అనుభవం లేదు. మరొకరు ఉండే బావువుంటుందని అనుకున్నాం. నాకు లక్ష్మీ నారాయణకి మంచి సింక్‌ ఉంది. చాలా అద్భుతమైన సమన్వయంతో ఈ సినిమా చేశాం. 

ఈ సినిమా కథ విషయంలో వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా ? 
వంశీ : ఖుషి సినిమా సమయంలో నేను ఫస్ట్ క్లాస్. నా అనుభవంలో లేవు కానీ అనుదీప్ వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్పేవారు. టికెట్ల కోసం ఎంతదూరం వెళ్తారో చెబుతుంటే చాలా సీరియస్ గా, అదే సమయంలో ఫన్నీ అనిపిస్తాయి. అప్పట్లో చాలా మానియా  ఉండేది. 

ఖుషి అంటే 2001.. ఈ సినిమా కోసం అప్పటి వాతావరణం రిక్రియేట్ చేశారా ? 
చాలా అంశాలు రిక్రియేట్ చేశాం. టీజర్ లో చూస్తే అప్పటి బాక్సులు కనిపిస్తాయి. దాంతో పాటు చాలా వరకు అప్పటి వావతరణం సృష్టించాం. 

హీరో హీరోయిన్ల గురించి
వంశీ: శ్రీకాంత్ పిట్టగోడ అనే సినిమాలో చేశాడు. ఆడిషన్ చేశాం. తెలంగాణ యాస, సింపుల్ హ్యుమర్, అమాయకత్వంతో కథకు సరిగ్గా నప్పాడు. హీరోయిన్ సంచితాది బిహార్. 

ఫస్ట్ డే ఫస్ట్ షో మరో జాతిరత్నాలు అనుకోవచ్చా ? 
వంశీ:  ఫస్ట్ డే ఫస్ట్ షో డిఫరెంట్ మూవీ. అయితే జాతిరత్నాలు ఫ్లేవర్  ఉంటుంది. 

ఫస్ట్ డే ఫస్ట్ షో మీ అనుభవాలు గురించి ?
లక్ష్మీనారాయణ : తిరుపతిలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరికేవి. రాత్రి మూడు గంటలకు షో వుండేది. అలా పంజా సినిమా చూశా. చాలా మంది జనం వుండేవారు. అప్పుడప్పుడు తొక్కిసలాట వుండేది. అందుకే ఈ కథకి చాలా కనెక్ట్ అయ్యా. 

వంశీ: నా జనరేషన్ కి వచ్చేసరికి టికెట్లు సులువుగానే దొరికేవి. ఒక్కడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా. 

కథలో పవన్ కళ్యాణ్ ని ఎంతవరకూ వాడుకున్నారు ?
హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కథలో ఎంత మేరకు వాడాలో అంతవరకు  ఉంటుంది. ఏది వాడినా సినిమాని వినోదాత్మకంగా చేయడానికే ప్రయత్నించాం. 

తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నటులతో పని చేయడం ఎలా అనిపించింది ?
లక్ష్మీ నారాయణ : సీనియర్స్ తో పని చేయడం చాలా మంచి అనుభవం. వారి అనుభవంతో యాడ్ చేసిన ఫ్లావర్ అద్భుతం అనిపించింది. వారితో పని చేయడానికి కాస్త భయపడ్డాం. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ నటులకు మనం ఏం చెప్పగలం అనిపించేది. ఐతే వాళ్ళు గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. అందరి సీన్స్ అద్భుతంగా వచ్చాయి. యంగ్ టీంతో పని చేయడాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు.  

భవిష్యత్ లో ఇద్దరూ కలసి ప్రయాణించే ఆలోచన ఉందా ? 
వంశీ: ఇప్పటికి ఏం అనుకోలేదు. ఈ సినిమాకి అవసరం కాబట్టి కలసి చేశాం. 

మీకు బలమున్న జోనర్ ఏది ? 
వంశీ : కామెడీ.  అలాగే నాకు నటనపై కూడా ఆసక్తి ఎక్కువ 
లక్ష్మీ నారాయణ: అన్ని జోనర్స్ చేస్తాను. కామెడీ కొంచెం ఎక్కువ ఇష్టం

సంగీతం గురించి చెప్పండి ? 
రధన్ చాలా ప్రతిభ  ఉన్న కంపోజర్. భాష తెలియనప్పటికీ ఆయనకి గొప్ప అండర్ స్టాండింగ్ వుంది. పాటలతో పాటు అద్భుతమైన నేపధ్య సంగీతం అందించారు. 

పూర్ణోదయలో సినిమా చేయడం ఎలా అనిపించింది ? 
పూర్ణోదయ అంటేనే క్లాసిక్. సినిమాని ప్రేమించే నిర్మాతలు. సినిమాలో స్వర్ణయుగం చూశారు. శ్రీజ గారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మొదటిసారి సినిమా చేస్తున్న నిర్మాతలా అనిపించలేదు. చాలా ఫాస్ట్ గా చేశారు. అనుకున్న షెడ్యుల్ ప్రకారమే షూటింగ్ ఫినిష్ చేయడం వారికి చాలా నచ్చింది. 

కొత్తగాచేయబోతున్న సినిమాలు ? 
కొన్ని ఆలోచనలు  ఉన్నాయి. ఇంకా ఏదీ ఖరారు కాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement