‘నా మొదటి సినిమా 'తొలిప్రేమ' విజయం సాధించినప్పటికీ, ఒక ఐదు శాతం మంది ప్రేమకథే కదా అన్నట్టుగా కాస్త నెగటివ్ గా మాట్లాడారు. కానీ 'లక్కీ భాస్కర్'కి మాత్రం ఒక్క శాతం కూడా అలాంటి నెగటివ్ స్పందన రాలేదు. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు అందరూ సినిమా బాగుంది అన్నారు. ఒక సినిమాని ఇలా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను’అన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ వెంకీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ 'లక్కీ భాస్కర్' కథ విని అందరూ బాగుంది అన్నారు. కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుందని భరోసా ఇచ్చారు.
→ నేను సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు.. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంభాషణకి వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా చాలా సంతోషం కలిగింది. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాయడం జరిగింది. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది.
→ సినిమా సెట్ లో హీరోనే మెయిన్ పిల్లర్. హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది. దుల్కర్ ఉదయం రావడమే ఫుల్ ఎనర్జీతో వచ్చేవారు. ఆయన ఈ కథని నమ్మడం వల్ల, సెట్ లో అంత సంతోషంగా ఉండటం వల్లే ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది. సన్నివేశాలు, సంభాషణలు చదివి బాగున్నాయని అభినందించే వారు. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా రాసేవాడిని.
→ మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాను. కానీ నిర్మాత వంశీ ఈ కథని ఎంతో నమ్మారు. కథకి తగ్గ భారీతనం తీసుకురావడం కోసం సెట్లు వేయాలని నిర్ణయించారు. కథని అంతలా నమ్మారు కాబట్టే వంశీ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో నిర్మించారు.
→ బ్యాంకింగ్ నేపథ్యం సాగే కథ ఇది. దీని కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. కొన్ని సిరీస్ లు చూశాను. అయితే అవి టెక్నికల్ గా సాధారణ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకోవడం జరిగింది.
→ సినిమాలు ఎడిట్ టేబుల్ మీద తయారవుతాయని భావిస్తాను. ఎడిటర్ నవీన్ నూలితో తొలిప్రేమ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. నవీన్ ని ఎంతో నమ్ముతాను. ఏదైనా తప్పు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్తాడు. ఎడిటర్ గా లక్కీ భాస్కర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా ఎడిటింగ్ గురించి అందరూ అందుకే అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
→ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ఏది ఒప్పుకోలేదు. ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment