‘మంచి మనసున్న మనుషులంతా కలిస్తే గొప్ప సినిమా తెరకెక్కించవచ్చని నేను నమ్ముతా. దానికి ‘లక్కీ భాస్కర్’ చిత్రమే ఓ మంచి ఉదాహరణ. ఈ సినిమాలో పని చేసినవారంతా గొప్ప వ్యక్తులు. వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. అందుకే ఇంత పెద్ద విజయం లభించింది.తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇకపై కూడా మంచి కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాను’అని అన్నారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీఓపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది.
‘ఓకే బంగారం’ విడుదలయ్యాక నిర్మాత దిల్‌రాజు నాకొక అవకాశం ఇచ్చారు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమా అంగీకరించలేకపోయా. నాగి, స్వప్న 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదనే చెప్పాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, "ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. టీం అందరం ఎంతో కష్టపడి పని చేశాము. ఆ కష్టానికి తగ్గ ఫలితంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. దుల్కర్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment