నా కొడుకును బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు: విజయ్‌ దేవరకొండ తండ్రి | Vijay Deverakonda's Father Angry On Abhishek Nama Over His Allegations | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: 'రెమ్యునరేషన్‌ సగం వెనక్కిచ్చేశాడు, ఇంకేం చేయాలి.. అలాంటి వ్యక్తితో ఇకపై విజయ్‌ సినిమాలు చేయడు!'

Published Sat, Sep 9 2023 10:31 AM | Last Updated on Sat, Sep 9 2023 11:26 AM

Vijay Deverakonda Father Angry on Abhishek Nama Allegations - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండకు గడ్డుకాలం నడుస్తోంది. గతకొంతకాలంగా సరైన హిట్‌ లేక నీరుగారిపోయిన అతడికి ఖుషి సినిమా సక్సెస్‌ను తెచ్చిపెట్టింది, కానీ దాన్ని ఎంజాయ్‌ చేసే పరిస్థితి లేదు. కారణం.. ఖుషి హిట్‌ కొట్టిన ఆనందంలో తన అభిమానులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు విజయ్‌. వంద కుటుంబాలకు కలిపి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఇంకేముంది, విజయ్‌ ప్రకటన చూసిందే ఆలస్యం ఓ నిర్మాణ సంస్థ కౌంటర్‌కు దిగింది.

పబ్లిక్‌గా టార్గెట్‌
'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం, దీనిపై ఎవరూ స్పందించట్లేదు. ఎలాగో మీరు వంద కుటుంబాలకు కోటి ఇస్తామంటున్నారు. అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌ కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం' అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. దీంతో విజయ్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నిజానికి సినిమా లాభనష్టాలనేది నిర్మాత- డిస్ట్రిబ్యూటర్స్‌ మధ్య వ్యవహారం. కానీ ఇలా పబ్లిక్‌గా డబ్బులివ్వమని హీరో విజయ్‌ను టార్గెట్‌ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెమ్యునరేషన్‌ సగం వెనక్కు
తాజాగా ఈ వ్యవహారంపై విజయ్‌ తండ్రి గోవర్దన్‌ రావు స్పందించాడు. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా ఆడనప్పుడు విజయ్‌ తన రెమ్యునరేషన్‌లో సగం వెనక్కు ఇచ్చేశాడు. తనకు ఇస్తానన్న ఫ్లాట్‌ కూడా వద్దన్నాడు. ఇంతకంటే ఇంకేం చేయగలడు. అయినా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టాలు వస్తే విజయ్‌ ఏం చేస్తాడు? అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన విషయం. అభిషేక్‌ చాలాకాలంగా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాడు. మేము అతడితో మాట్లాడుతున్న విషయం కూడా విజయ్‌కు తెలియదు. అలాంటిది ఇప్పుడేకంగా సోషల్‌ మీడియాలో నా కొడుకు పేరు ప్రస్తావించడం బాధాకరం. నిజంగా మేము అతడికి ఏమైనా డబ్బులిచ్చేది ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సింది.

విజయ్‌ అతడితో సినిమాలు చేయడు
అభిషేక్‌ నా కొడుకును బ్లాక్‌మెయిల్‌ చేయాలని చేస్తున్నాడు. కానీ అతడి పప్పులేమీ ఉడకవు. ఓసారేమో విజయ్‌ మార్కెట్‌ పడిపోయిందంటాడు. మరోసారి విజయ్‌తో సినిమా నిర్మించేందుకు అతడి డేట్స్‌ కావాలంటాడు. అతడు మాట్లాడే మాటలకు పొంతన కుదరడం లేదు. అయినా ఇప్పటికే విజయ్‌.. దిల్‌ రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్లలో సినిమాలు చేసేందుకు సంతకం చేశాడు. కాబట్టి అతడి డేట్స్‌ ఖాళీగా లేవు. అభిషేక్‌ నామాతో విజయ్‌ సినిమాలు చేయడు' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌.. కొత్త డేట్‌ చెప్పు గురూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement