
కుర్రకారు మనసు దోచిన లేటెస్ట్ తెలుగు హాట్‌స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి ఆ సంగతి రుజువు చేశారు. తాజాగా ఓ ఆంగ్లపత్రిక చేసిన సర్వేలో... విజయ్ దేవరకొండ వరుసగా ముచ్చటగా మూడో ఏడాది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ పట్టం అందుకున్నారు. మునుపెన్నడూ ఎవరూ సాధించని ఈ ఫీట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’లో నటిస్తున్న ఈ రౌడీ స్టార్, వీలైతే వచ్చే ఏడాది కూడా ఈ టైటిల్‌ను నిలబెట్టుకుంటాననీ, ఇంకా కుదిరితే ఎవరూ అందుకోలేని రికార్డ్ నెలకొల్పాలని ఉందనీ సరదాగా చెప్పుకొచ్చారు.
‘భౌతిక దూరం పాటిస్తూ, బతికుండడమే ఎక్కువైన రోజుల్లో అమ్మాయిల కలల రాకుమారుడి పట్టం దక్కడం చిత్రమైన సంగతి’ అన్నారు విజయ్ దేవరకొండ. మరి, ఇంతమంది మనసు దోచిన ఈ స్టార్‌కి ఎలాంటి వాళ్ళంటే ఇష్టం? ‘స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికేవాళ్ళంటే ఇష్టం. జీవితంలో ఒక లక్ష్యం, చేపట్టిన పని మీద పట్టరాని మోహం ఉన్నవాళ్ళను ఇష్టపడతా. ఆడ, మగ అని తేడా లేదు... అలాంటివాళ్ళు ఎవరైనా సరే నా చుట్టూ ఉండాలని కోరుకుంటా. అంత ఉద్వేగంతో జీవించేవాళ్ళ పట్ల నేను ఆకర్షితుణ్ణి అవుతా’ అని విజయ్ వివరించారు.
లాక్ డౌన్‌తో ఇంట్లోనే గడుపుతున్న వేళ గంటల కొద్దీ వ్యాయామం చేయడానికి ఇబ్బంది లేకున్నా, ఖాళీగా కూర్చొని, ప్రతి అరగంటకూ ఏదో ఒకటి తినేయడం ఇబ్బందిగా ఉందట ఈ యూత్ ఐకాన్‌కి. తీపి పదార్థాలంటే పడిచచ్చే విజయ్ ఈ సీజన్‌లో మామిడి పండ్లు తెగ లాగిస్తున్నారట. దాంతో, డైట్ పాటించడం ఇబ్బందిగా ఉందని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment