ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తంగలాన్' ట్రైలర్ వచ్చేసింది. విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్‌తో ఫిదా చేసిన విక్రమ్ తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ప్రేక్షకులను మరో ప్రపంపంలోకి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. బంగారం కోసం అన్వేషణ అందుకోసం జరుగుతున్న పోరాటం ఆసక్తి కలిగించే విధంగా ట్రైలర్ ఉంది. తంగలాన్‌లో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు.
ట్రైలర్ ఎలా ఉందంటే..
'తంగలాన్' సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - బ్రిటీష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం వేట మొదలుపెడతారు బ్రిటీష్ అధికారులు. స్థానిక తెగల వారిని బంగారం వెలికి తీసేందుకు పనిలో పెట్టుకుంటారు. ఒక తెగ నాయకుడిగా విక్రమ్‌ను చూపించారు. ఈ బంగారం వేటలో రెండు తెగల మధ్య పోరు మొదలవుతుంది. తన వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడిగా విక్రమ్ చూపించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ ఈ పాత్ర కోసం మారిపోయిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తోంది.
ట్రైలర్ లో విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. విక్రమ్ బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చరిత్రలోని వాస్తవ ఘట్టాలను దర్శకుడు పా. రంజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు 'తంగలాన్' ట్రైలర్ తో తెలుస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు త్వరలోనే 'తంగలాన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment