ఏదో ఒక వివాదంలో నానుతూ ఉండే నటుడు అజాజ్ ఖాన్. దురుసు వ్యాఖ్యలతో, డ్రగ్స్ వివాదంతో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండే ఈయన కొద్ది నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. 2021లో డ్రగ్స్ కేసులో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేయగా రెండున్నరేళ్లపాటు జైలుజీవితం గడిపాడు. మే 19న బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు ఇటీవల తన అనుభవాలను చెప్పుకొచ్చాడు.
400 మందికి నాలుగే బాత్రూమ్స్
'ఈ రెండు సంవత్సరాలు నాకెంతో కష్టతరమైనవి. నేను నిజం మాట్లాడాను.. ఫలితంగా దగ్గరివాళ్లే నన్ను దూరం పెట్టారు. 26 నెలలపాటు నా కుటుంబానికి, అనారోగ్యంతో ఉన్న నా తండ్రికి దూరంగా ఉన్నాను. నా కుటుంబం కోసం నన్ను ఇంకా బతికే ఉంచినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదంటే.. ఎండిపోయిన చపాతీలు, రాళ్ల అన్నం తినేవాడిని. 400 మంది ఖైదీలకు నాలుగంటే నాలుగే బాత్రూమ్స్ ఉండేవి. బయటకు వచ్చాక సాధారణ జీవితానికి అలవాటు పడటానికి నెల రోజులు పట్టింది.
ఒకరిపై మరొకరు పడుకుంటారు
మంచి ఆహారం తీసుకోవడం, శుభ్రమైన బాత్రూమ్‌లో స్నానం చేయడం.. ఇంకా కొత్తగానే ఉంది. జైలులో ఎలుకలు, పురుగులు పడ్డ పప్పునే తిన్నాను. పురుగులు, కీటకాలతోపాటు నేలపై పడుకునేవాడిని. ఇక్కడ జైళ్లు ఎంత రద్దీగా ఉంటాయంటే.. స్థలం లేక ఒకరిపై మరొకరు పడుకుంటారు. 800 ఖైదీల సామర్థ్యం ఉన్న జైల్లో 3000 మందిని కుక్కుతారు. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పేరు కూడా ఓ కేసులో జైలుకు వచ్చాడు. కానీ ఏమైంది? సింపుల్‌గా బయటపడ్డాడు. అతడికి, రాజ్‌కుంద్రాకు నేను జైలులో సాయం చేశాను. అయినా ఇప్పుడు దేని గురించీ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఒకటే ఆశిస్తున్నాను. నేను నటుడిని, నాకు పనివ్వండి.. నా కుటుంబాన్ని పోషించుకోవాలి' అని అర్థిస్తున్నాడు అజాజ్ ఖాన్.
నాలుగుసార్లు కటకటాలపాలు
అజాజ్ ఖాన్‌ను తొలిసారి డ్రగ్స్ కేసులో 2018లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసినందుకు 2019 జూలైలో, ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్ట్‌ను అప్‌లోడ్ చేసినందుకు 2020 ఏప్రిల్‌లో మరోసారి అరెస్టు చేశారు. ఇన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఈ నటుడు 2021 డ్రగ్స్ కేసులో మరోసారి కటకటాలపాలయ్యాడు. ఈసారి మాత్రం కఠిన కారాగార శిక్ష ఎదుర్కొన్నాడు. రెండున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. ఈ ఏడాది మే 19న బెయిల్‌తో బయటకు వచ్చాడు.
అజాజ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే..
అజాజ్ ఖాన్.. లకీర్ కా ఫఖీర్, అల్లా కీ బండే, హై తుజే సలాం, ఫర్కీ రిటర్న్స్.. ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్‌లో రక్త చరిత్ర, దూకుడు, బాద్‌షా, హార్ట్ ఎటాక్ వంటి సినిమాల్లో విలన్‌గా యాక్ట్ చేశాడు. అలాగే బుల్లితెరపై.. దివ్య ఔర్ బాతీ హమ్, మట్టి కీ బన్నో, కారమ్ ఆప్నా ఆప్నా.. వంటి అనేక సీరియల్స్‌లో నటించాడు. ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 'బిగ్ బాస్' సీజన్-7 లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే 8వ సీజన్‌లో కూడా కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment