సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో | When Film Shooting Begins In This Pandemic Time | Sakshi
Sakshi News home page

సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో

Published Wed, Jun 16 2021 1:05 AM | Last Updated on Wed, Jun 16 2021 4:58 AM

When Film Shooting Begins In This Pandemic Time - Sakshi

కెమెరా ఆన్‌ అయ్యేదెప్పుడు?
క్లాప్‌ బోర్డ్‌ కొట్టేదెప్పుడు?
డైరెక్టర్‌ స్టార్ట్‌ యాక్షన్‌ అనేదెప్పుడు?
నటీనటులు మేకప్‌ బాక్స్‌ తెరిచేదెప్పుడు?
అనే ఎదురుచూపులకు బ్రేక్‌ పడింది.
ఆదివారం ఒకటి, సోమవారం ఒకటి, 
మంగళవారం ఒక సినిమా...
సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... 
ఛలో ఛలో అంటూ షూటింగ్స్‌ 
ప్రారంభించుకున్నాయి.
నెలాఖరుకల్లా మరిన్ని సినిమాల 
షూటింగ్స్‌తో పరిశ్రమ కళకళలాడనుంది.
ఆన్‌ సెట్స్‌లో ఉన్న, త్వరలో ఆన్‌ సెట్స్‌కి 
రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.


నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమా షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు సంపూర్ణేష్‌బాబు హీరోగా చేస్తున్న ‘క్యాలీఫ్లవర్‌’ షూటింగ్‌ ఆల్రెడీ హైదరాబాద్‌లో మొదలైపోయింది. ఈ నెలాఖరు లోపు మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందకు సిద్ధమవుతున్నాయి. 

ప్రభాస్‌ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ఈపాటికే పూర్తి కావాల్సింది. కానీ కోవిడ్‌ వల్ల కుదరలేదు. ఈ సినిమా షూటింగ్‌ని ఈ నెలాఖరున ప్రారంభించాలనుకుంటున్నారు. కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌ జూలై 30న విడుదలకు షెడ్యూల్‌ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప’ షూటింగ్‌ మూడు నాలుగు రోజులు చేస్తే పూర్తయ్యే పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఈ నెల చివర్లో ఈ సినిమా షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. అలాగే కోవిడ్‌ కారణంగా బ్రేక్‌ పడిన ‘ఖిలాడి’ చిత్రీకరణ కూడా ఈ నెల చివర్లో షురూ కానుంది. రవితేజ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మే 28న విడుదల కావాల్సింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయింది. ఇక ‘మనం’ మూవీ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ ఫైనల్‌ షెడ్యూల్‌ మినహా పూర్తయింది. మేజర్‌గా వైజాగ్, ఇటలీలో షూటింగ్‌ జరుపుకున్న ‘థ్యాంక్యూ’ చిత్రం ఫైనల్‌ షెడ్యూల్‌ ఈ నెల 20 తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గౌర్‌ కీలక పాత్రధారి. కోవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ అన్ని జాగ్రత్తలతో కొన్నాళ్లు ‘శాకుంతలం’ చిత్రీకరణ జరిగింది. లాక్‌డౌన్‌ వల్ల బ్రేక్‌ పడింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత నటిస్తున్న ఈ మైథాలాజికల్‌ మూవీ చిత్రీకరణ కూడా ఈ నెలాఖరున ఆరంభం కానుంది. ఈ చిత్రాలతో పాటు నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’, బెల్లంకొండ గణేష్‌ కొత్త చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాలు ఈ నెలలోనే పక్కాగా సెట్స్‌కి వెళతాయని తెలిసింది. 

ఇక ఎన్టీఆర్‌–రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, రవితేజ హీరోగా శరత్‌ మండవ డైరెక్షన్‌లోని మూవీ, నిఖిల్‌ ‘18 పేజెస్‌’, బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా వీవీ వినాయక్‌ తెరకెక్కిస్తున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ చిత్రాల షూటింగ్స్‌ ప్రారంభం కానున్నాయని సమాచారం.

బాలీవుడ్‌లో కూడా షూటింగ్స్‌ బెల్‌ మోగింది. తన తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌లో సోమవారం నుంచి ఆమిర్‌ ఖాన్‌ పాల్గొంటున్నారు. అలాగే బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ నేను సైతం అంటూ షూటింగ్‌కి రెడీ అయ్యారు. ‘‘లాక్‌డౌన్‌ 2.0 తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాను. షాట్‌ కోసం ఉదయం ఏడు గంటలకే లొకేషన్‌కు చేరుకునేందుకు డ్రైవింగ్‌ చేస్తున్నాను’’ అని అమితాబ్‌ తన సోషల్‌æమీడియా అకౌంట్‌లో షేర్‌ చేశారు. ‘గుడ్‌ బై’ షూటింగ్‌లో పాల్గొంటున్నారాయన. ఇదే సినిమా షూటింగ్‌లో జాయినయ్యారు రష్మికా మందన్నా. ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌ హీరోగా పరిచయం అవుతున్న ‘మహారాజా’ సినిమా షూటింగ్‌ ఆల్రెడీ ముంబైలో స్టార్ట్‌ అయ్యింది. ‘‘ఇక వర్క్‌ చేయాల్సిన టైమ్‌ వచ్చింది’ అని రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశారు. దీన్ని బట్టి షారుక్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్‌’ చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇంకా ఆలియా భట్‌ ‘గంగూబాయి కతియావాడి’, సల్మాన్‌ఖాన్‌ ‘టైగర్‌ 3’, రణ్‌వీర్‌ సింగ్‌ ‘సర్కస్‌’, అజయ్‌ దేవగణ్‌ ‘మైదాన్‌’ వంటి చిత్రాలు కూడా సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయని  సమాచారం.

కోలీవుడ్‌లో కూడా షూటింగ్స్‌ జరుపుకునేందుకు ఆయా చిత్రబృందాలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. విశాల్‌ తాజా సినిమా షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇక కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’, విజయ్‌ హీరోగా నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా, సూర్య హీరోగా పాండిరాజ్‌ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం, విక్రమ్‌ ‘కోబ్రా’, కార్తీ ‘సర్దార్‌’ చిత్రాలు షూటింగ్స్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement