ప్రముఖ సినీ రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో ఆస్కార్ గ్రంథాలయం నిర్మించారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో తన గ్రామ ప్రజలు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా చల్లగరిగెలో తనకు దక్కిన గౌరవానికి గుర్తుగా 'ఆస్కార్ గ్రంథాలయం' ఏర్పాటు చేస్తానని చంద్రబోస్ మాట ఇచ్చారు. గ్రామంలో ఇది వరకే ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి రూ. 36 లక్షలతో కొత్త భవనాన్ని ఆయన నిర్మించారు.
నేడు జులై 4న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా ఆ గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు. రెండంతస్తులతో అన్ని వసతులతో దానిని ఆయన నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న గ్రామంలోని యువకులకు అవసరమయ్యే అన్నీ పుస్తకాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు.
సుమారు 30 ఏళ్ల కెరీర్‌లో సినీ పాటల రచయితగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు చంద్రబోస్. 860 సినిమాల్లో 3600కిపైగా పాటలు ఆయన రాశారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టిన చంద్రబోస్ అసామాన్యంగా చిత్రసీమలో ఎదిగారు. రాబోవు తరాల కవులకి ఆయన జీవితం, ప్రయాణం ఆదర్శవంతం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఆయన రచించిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. కొండపొలం (2021) సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు ఎస్సార్ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ఆయన అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment