చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
వికారాబాద్ చెందిన సౌమ్య(చాందిని చౌదరి) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదిస్తుంది. తను ఆ జాబ్ చేయడం తండ్రి, సోదరుడికి అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా సౌమ్య ఉద్యోగాన్ని వదులుకోదు. తన పై అధికారి అభి(భరత్ రాజ్) అంటే సౌమ్యకు ఎనలేని అభిమానం. అతన్ని స్ఫూర్తిగా తీసుకొనే పోలీసు వృత్తిని ఎంచుకుంటుంది. సౌమ్య ఉద్యోగంలోకి చేరిన కొద్ది రోజులకే వికారాబాద్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. యుగంధర్(వశిష్ట సింహ) అనే ఓ వ్యక్తి హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసి..హత్యలు చేస్తుంటాడు. ఈ కేసును సౌమ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అభికి సమాచారం యుగంధర్‌ని పట్టుకునేందుకు వెళ్లి ప్రమాదానికి గురవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యుగంధర్‌ని పట్టుకునేందుకు ట్రై చేస్తుంటారు. మరి వారి ప్రయత్నం ఫలించిందా? అసలు ఎవరీ యుగంధర్? హీరోల పేర్లు చెప్పి ఎందుకు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు? అభికి యుగంధర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసును సౌమ్య ఎలా డీల్ చేసింది? చిత్రానికి యేవమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇదో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సైకో థ్రిల్లర్‌ని, స్ల్పిట్ పర్సనాలిటీ కలిపి కథగా మార్చుకున్నాడు దర్శకుడు ప్రకాష్ దంతులూరి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉన్నా.. తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో మాయ చేసేందుకు ప్రయత్నించాడు. కథ ప్రారంభంలోనే యుగంధర్ నైజం ఏంటో అర్థమైపోతుంది. అఘరెడ్డి బెడ్ సీన్‌తో కథను ప్రారంభించి.. ఆ తర్వాత స్టోరీని వికారాబాద్ పోలీసు స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అభి, సౌమ్య పాత్రల పరిచయం..వారి నేపథ్యం చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉంటుంది. ప్రభాస్ పేరు చెప్పి ఓ అమ్మాయిని ట్రాప్ చేసే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా యుగంధర్ వరుసగా హీరోలను పేర్లు చెబుతూ అమ్మాయిలను ట్రాప్‌లోకి దించడం బోర్ కొట్టిస్తుంది.
మరోవైపు అభి-సౌమ్యల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. అసలు సౌమ్య అభిలో ఏం చూసి ఇష్టపడిందనే పాయింట్‌ని బలంగా చూపించలేకపోయారు. సైకోని పట్టుకునేందుకు సౌమ్య ఇచ్చే సలహాలు కూడా సింపుల్‌గానే ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. అప్పటికే సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చిన ప్రేక్షకుడికి ఇంటర్వెల్ బ్యాంగ్ షాకిస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఊహకందేలా సాగుంది. సైకో పక్కన తిరుగుతున్నా పట్టుకోలేకపోవడం.. అతని కవ్వింపు చర్యలు అవన్నీ రొటీన్ సైకో థ్రిల్లర్స్‌లాగే ఉంటాయి. సౌమ్య సైకోని ఎలా పట్టుకొంది? ఎలా గుర్తించింది? అనేది మరింత బలంగా చూపిస్తే బాగుండేది. అక్కడ రివీల్ చేసే ట్విస్ట్ అంతగా ఆకట్టుకోలేదు. తెలంగాణ ఒగ్గు కథ పాటతో ఓ ప్రధాన సన్నివేశాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్. స్క్రీన్‌ప్లే మాదిరి కథను కూడా ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
తొలిసారి చాందిని పోలీసులు పాత్రను పోషించి మెప్పించింది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేసింది. యుగంధర్ పాత్రలో వశిష్ట సింహ విలనిజం బాగా చూపించాడు. అభిగా భరత్ రాజ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఆ పాత్రలో తెలిసిన నటుడైతే బాగుండేది. కానిస్టేబుల్‌గా గోపరాజు రమణ తో పాటు మిగిలిన నటీనటులతో తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
Comments
Please login to add a commentAdd a comment