బహిరంగ సభలో మాట్లాడుతున్న బండి సంజయ్
భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని.. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ చేపట్టిన మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక పాత బకాయిలు మొత్తం చెల్లించి సంస్థను పరిరక్షిస్తామని చెప్పారు. సింగరేణి సంస్థలో గతంలో 72వేల మంది కార్మికులు ఉండగా.. ఇప్పుడు 42వేలకు తగ్గారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ తన కూతురు కవితను యూనియన్ నాయకురాలిని చేసి సంస్థను ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు.
సింగరేణికి వేల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్న సీఎం.. కార్మికులకు ఐటీ రీయింబర్స్‌మెంట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఓపెన్‌కాస్ట్‌లను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇయాల 17 ఓపెన్‌కాస్ట్‌లకు అనుమతి తీసుకున్నాడన్నారు. సింగరేణి నుంచి రూ.25వేల కోట్ల అప్పు ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. సంస్థను దివాలా తీయించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికుల జీతాల కోసం బ్యాంకుల్లో బాండ్లు కుదువపెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, ఉచిత యూరియా, విత్తనాలు, ఇంటికో ఉద్యోగం, పోడు భూములకు పట్టాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నందుకు.. ప్రజలను దారి మళ్లించేందుకు పీఎం మోదీ తనకు దోస్త్ అని సీఎం ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. చేయి గు ర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఏ పార్టీలోకి పో యారో ప్రజలకు తెల్వదా అన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రజల కోసం పోరాడుతున్న ఏకై క పార్టీ బీజేపీయేనన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఏనాడైనా తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారా.. అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ కొత్త డ్రామాలకు తెర లేపుతున్నాడన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు.
తాము అధికారంలోకి వచ్చాక ఉచిత వైద్యం, విద్య, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభలో రిటైర్డ్ డీజీపీ క్రిష్ణప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తి రెడ్డి, రాకేష్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు కన్నం యుగేందర్, ఉదయ్‌ప్రతాప్, సునీల్‌రెడ్డి, పాపయ్య , రాజుగౌడ్, ఎరుకల గణపతి, మునీందర్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment