
గడువులోగా పనులు పూర్తయ్యేనా?
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు ఇంకా 12 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతరకు సుమారుగా 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర ఏర్పాట్ల అభివృద్ధి పనుల కోసం రూ.5.33 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో కొన్ని శాఖల పనులు మొదలు కాగా మరికొన్ని శాఖల పనులు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. మంత్రులు సీతక్క, కొండా సురేఖలు జనవరి 24న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఫిబ్రవరి 3వ తేదీ వరకు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా ఇప్పటి వరకు ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇరిగేషన్ శాఖ పనులు అంతంతే...
మేడారంలో మినీ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇరిగేషన్ శాఖకు రూ.12 లక్షల నిధులు కేటాయించారు. ప్రస్తుతం జంపన్నవాగులోని రెండు ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో పూడికతీత పనులు మాత్రమే మొదలయ్యాయి. ఇంకా డ్రెసింగ్ గదులు, భక్తుల జల్లు స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్ ట్యా ప్ నల్లాలు బిగించాల్సి ఉంది. మినీ జాతరకు ముందస్తుగా వచ్చే భక్తుల స్నానాల కోసం ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించిన ఫలితం లేదు. రెండు, మూడు రోజుల్లో డ్రెసింగ్ గదులు, ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో పూడికతీత పనులు పూర్తవుతాయని ఇరిగేషన్ డీఈ సదయ్య తెలిపారు.
మొదలుకాని పీఆర్ శాఖ పనులు..
మేడారంలో పంచాయతీ రాజ్ శాఖకు రూ.18.83 లక్షలు నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాల నుంచి రెండవ క్యూలైన్ వరకు రోడ్డు ప్యాచ్ వర్క్ పనులతో పాటు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాల్సి ఉన్నా.. ఇప్ప టి వరకు ఏ పని కూడా మొదలు కాలేదు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మినీ ట్యాంకులకు నల్లాల బి గింపు, చిలుకలగుట్ట, మేడారం ఆర్టీసీ వై జంక్షన్‌లో బ్యాట్ ఆఫ్ ట్యాప్ నల్లాల బిగింపు పనులు చేపట్టా రే తప్పా, చేతిపంపుల మరమ్మతు, బోర్ బావుల ఫ్లషింగ్ పనులు ఎక్కడా కూడా కానరాలేదు.
ప్యాచ్ వర్క్ పనులతోనే సరి...
పస్రా నుంచి మేడారం వరకు ఆర్‌అండ్‌బీ ప్యాచ్ వర్క్ పనులు కొనసాగుతున్నాయి. ప్యాచ్ వర్క్ పనుల్లో జేఎస్‌బీ డస్ట్ కంకర పోసి దానిపై తారు వేయాల్సి ఉంది. కేవలం గుంతలు ఉన్నంత వరకే కంకర పోసి దానిపై డాంబర్ తారు పోస్తూ మమ అనిపిస్తున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా గ్యాంగ్‌మెన్‌లు దగ్గరుండి పనులు చేయించడం గమనార్హం. మేడారం జాతరకు రోడ్ల మరమ్మతుల పనులు పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
అటవీ శాఖ పనుల్లో నిర్లక్ష్యం..
ఈసారి మినీ జాతరకు అటవీశాఖకు ఎడ్లబండ్ల రహదారుల మరమ్మతు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినా.. ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. ఎడ్లబండ్ల దారిలో మరమ్మతు పనులు గతంలో వేరే శాఖకు కేటాయించే వారు. దారులన్నీ అటవీశాఖతో ముడిపడి ఉండటంతో ఈసారి మాత్రం ప్రత్యేకంగా అటవీ శాఖ అధికారులకే ఎడ్ల బండ్ల దారుల మరమ్మతు పనులను అప్పగించారు. అటవీ శాఖ అధికారులు ఈ పనులు ఏ మేరకు పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది.
12 రోజులే మిగిలింది...
మినీ మేడారం జాతరకు ఇంకా 12 రోజులే మిగిలింది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పూజారులు జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ఈనెల 5న (బుధవారం) మేడారం, కన్నెపల్లిల్లోని సమ్మక్క, సారలమ్మల ఆలయాలను పూజారులు శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నారు. అమ్మవార్ల దర్శనానికి ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందస్తుగా వచ్చే భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు కృషి చేయాలని పూజారులు కోరుతున్నారు.
3వ తేదీ వరకు పనులన్నీ పూర్తి
మినీ జాతర పనులన్నీ 3వ తేదీ వరకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేడారం మినీ జాతరలో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెసింగ్ గదులు, విద్యుత్ ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. గత జాతర కంటే ఈసారి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం.
– దివాకర టీఎస్, కలెక్టర్
మేడారం మినీ జాతరకు మిగిలింది 12 రోజులే
ఇంకా కొనసా..గుతున్న పనులు
తరలివస్తున్న భక్తులు

గడువులోగా పనులు పూర్తయ్యేనా?
Comments
Please login to add a commentAdd a comment