మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేయాలి
ములుగు: ఈ నెల 26నుంచి 28వ తేదీ వరకు వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకలను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు(స్థానిక సంస్థలు) సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ నలువాల రవీందర్, రామప్ప ఆలయ ఈఓతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్ప జాతర నిర్వహణకు అదనపు బస్సులు నడిపించడానికి ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, పార్కింగ్, దేవాలయం సమీపంలో వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంపుల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, హెల్ప్ సెంటర్, సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని భద్రత చర్యలు తీసుకుంటామని వివరించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. ఆలయ పరిసరాల్లో చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య సిబ్బంది ప్రతిరోజూ శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని తెలిపారు.
అదనపు కలెక్టర్ సంపత్‌రావు
Comments
Please login to add a commentAdd a comment