మేడారానికి నిత్యం వేలాది భక్తులు
జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ గదులు లేని చోట ఏర్పాటు చేసిన షవర్లు
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క –సారలమ్మల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. మహాజాతర, మినీ జాతరలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నా, నిత్యం వచ్చే భక్తులు కష్టాలు తప్పడం లేదు. మేడారానికి ప్రతి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ భక్తులు వందలాదిగా తరలివస్తుంటారు. సౌకర్యాలు లేమితో ఇక్కట్లు ఎదుర్కొంటున్న భక్తులు శాశ్వ త సదుపాయాలు కల్పించాలిన కోరుతున్నారు.
విడిది ప్రాంతాల్లో లేని టాయిలెట్ బ్లాక్‌లు
అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్, చిలుకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టం క్రాస్, నార్లాపూర్ చింతల్ ప్రాంతాల్లో ఎక్కువగా భక్తులు విడిది చేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో శాశ్వత టాయిలెట్ బ్లాక్‌లు నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న శాశ్వత టాయిలెట్ బ్లాక్‌లను వినియోగంలోకి తీసుకొచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుందని భక్తుల అభిప్రాయం.
జాతర సమయంలోనే తాగు నీరు..
మహాజాతర సమయంలో మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ అధికారులు తాగునీటి కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్ నల్లాలను ఏర్పాటు చేస్తారు. జాతర అనంతరం వాటిని తొలగించడంతో నిత్యం మేడారానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఏడాది పొడవునా తరలివచ్చే భక్తులకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి ట్యాంకుల ఏర్పాటు చేసి తాగు నీరు అందించాలని కోరుతున్నారు. మేడారానికి వచ్చే భక్తులు మినరల్ వాటర్ కొనుగోలు చేసి వంటావార్పు, దాహం తీర్చుకోవాల్సి వస్తోంది.
నిరంతర నిఘా అవసరం..
మేడారానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో వారి భద్రత కోసం పోలీస్ తరఫున నిరంతరం నిఘా ఉంచాలి. బుధ, గురు, ఆదివారాల్లో మేడారానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో.. మేడారం పరిసరాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాదాయ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటూ భక్తుల భద్రతకు భరోసా కల్పించాలంటున్నారు.
అరకొర సదుపాయాలతో ఇక్కట్లు
శాశ్వత పనులు చేపట్టాలని వేడుకోలు
మేడారానికి నిత్యం వేలాది భక్తులు
Comments
Please login to add a commentAdd a comment