‘రామప్ప’ను సందర్శించిన ఆర్కియాలజీ విద్యార్థులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ ఆర్కియాలజీ (2023–25 బ్యాచ్) కు చెందిన 22 మంది విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. గ్రేటర్ నోయిడాలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు శిక్షణలో భాగంగా కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శుక్రవారం రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రామప్ప ఆలయ విశిష్టత, కాకతీయుల చరిత్ర, రామప్ప ఆలయ నిర్మాణశైలి, ఆలయ ప్రత్యేకతలు పురావస్తుశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఆశీష్ రంజన్ సాహూ, సీనియర్ ఫొటోగ్రాఫర్ సుభాష్ చంద్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ సాయికృష్ణ, వరంగల్ ఇన్‌చార్జ్ నవీన్‌కుమార్, గార్డెన్ ఇన్‌చార్జ్ ప్రదీప్‌బాబు ఉన్నారు.
నీటిసరఫరాపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
ములుగు: గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటిసరఫరా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1800 5994007ను ఏర్పాటు చేసినట్లు మిషన్ భగీరథ ఇంట్రా డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సీహెచ్ సుభాష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 24/7 అందుబాటులో ఉంటుందని జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిర్మోహమాటంగా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదులపై స్పందించి, సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పీడీఎస్ బియ్యం స్వాధీనం
గోవిందరావుపేట: అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు పస్రా ఎస్సై కమలాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామ శివారులో శుక్రవారం పస్రా ఎస్సై కమలాకర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానంతో ఓ లారీని తనిఖీ చేసి పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీలో ఉన్న పీడీఎస్ బియ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం, లచ్చగూడేకి చెందిన బత్తుల రాజుకు చెందినవిగా అదే మండలానికి చెందిన డ్రైవర్ వల్లెపు బంగారి అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. ఇల్లందు చుట్టు పక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు బియ్యం సేకరించి మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. బియ్యం విలువ సుమారుగా రూ.6,47,000 ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కమలాకర్ వెల్లడించారు.
ఆశ్రమ పాఠశాల తనిఖీ
ఏటూరునాగారం: మండలంలోని ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, తాడ్వాయిలోని కళాశాల, ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి, వసతి గదులు, స్టాక్ రూమ్, భోజన మెనూ పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదుల్లో, వసతి గృహాల్లో విద్యుత్ సమస్యలు, ఇతర మరమ్మతులు ఉంటే వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కిటికీలు, దర్వాజలకు డోర్లను అమర్చాలన్నారు. వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. ఆమె వెంట డీడీ పోచం ఉన్నారు.
‘రామప్ప’ను సందర్శించిన ఆర్కియాలజీ విద్యార్థులు
‘రామప్ప’ను సందర్శించిన ఆర్కియాలజీ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment