ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ములుగు: ఈ నెల 27వ తేదీన జరగనున్న నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి తగిన సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర టీఎస్, ఓఎస్డీ మహేష్ బీ గీతే, ఆర్డీఓ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో పోలింగ్ స్లిప్పుల పంపిణీ 70 శాతం పూర్తికాగా.. శనివారం వరకు 100 శాతం పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 9 పోలింగ్ కేంద్రాల్లో 12 మంది పీఓలు, 12 మంది ఏపీఓలు, 12 మంది ఓపీఓలు, 11 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బందికి మొదటి, రెండో విడత శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్‌లో రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మెటీరియల్ రవాణాకు రెండు రూట్లను ఏర్పాటు చేశామని అన్నారు.
పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి
నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 27వ తేదీన నిర్వహించే పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు, విధులపై అవగాహ న కలిగి ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల పోలింగ్ పక్రియ భిన్నంగా ఉంటుందని అన్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ పోలింగ్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందన్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ఉంటుందని క్యూ లో ఉండేవారికి టోకెన్లు అందించాలని అన్నారు. ఎన్నికల కేంద్రానికి వెళ్లే ముందు చెక్‌లిస్ట్ ఆధారంగా మెటిరీయల్ అందిందా.. లేదా.. సరిచూసుకోవాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని అన్నారు. ఎన్నికల తతంగం ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారులు నల్గొండ జిల్లాకేంద్రంలోని రిసెప్షన్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులను భద్రత మధ్య తరలించాలని అన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ హమీద్ పవర్‌పాయింగ్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ అల్లం రాజ్‌కుమార్, తహసీల్దార్ విజయభాస్కర్, పర్యవేక్షకులు సలీం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
కలెక్టరేట్‌లో అధికారుల శిక్షణలో పాల్గొన్న కలెక్టర్
మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించాలి
జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శుక్రవారం నార్కోటిక్ డ్రగ్స్‌పై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయశాఖ తరఫున ప్రత్యేక నిఘాపెట్టాలని అన్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి నేతృత్వంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ జిల్లా అధికారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మత్తు పధార్థాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను విద్యార్థుల కు వివరించాలని చెప్పారు. టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ మూలాలపై నిత్యం నిఘా పెట్టాలని తెలిపారు. పోలీసు, ఆబ్కారీ శాఖలు సైతం డ్రగ్స్ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాణిని, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment