ములుగు: సెర్ప్ సంస్థ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టుమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్ సూచించారు. ఈ మేరకు సెర్ప్ సీఈఓ దివ్యతో కలిసి ఆయన గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌కుమార్ మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో సెర్ప్ ద్వారా ఏర్పాటు చేయనున్న ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 33శాతంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50శాతానికి పెంచేలా ప్రతిపాదనలు చేయాలని సూచించారు. నూతన కేంద్రాల ఏర్పాటును సైతం స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే నడిచేలా చూడాలన్నారు. ఐకేపీ కేంద్రాలకు అవసరమైన తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ఇతర సామగ్రిని సకాలంలో అందించాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల మహిళా సభ్యులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షల స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. కుటుంబంలో ఎవరైనా వృద్దాప్య పింఛన్ తీసుకుంటూ మృతిచెందితే జీవిత భాగస్వామి అర్హతను బట్టి పింఛన్ మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌సీ మల్లేశం, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, అడిషనల్ డీఆర్డీఓ బాలస్వామి, డీఈఓ పాణిని, ఏటూరునాగారం డీడీ పోచం, డీడబ్ల్యూఓ శిరీష, ఆర్‌ఎం డాక్టర్ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి
లోకేష్‌కుమార్