
అర్హులందరికీ సన్నబియ్యం
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి/గోవిందరావుపేట/వెంకటాపురం(ఎం): రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, ఎస్‌ఎస్ తాడ్వాయి, వెంకటాపురం(ఎం) మండల కేంద్రాల్లో, గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా, చల్వాయిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. సన్నరకం ధాన్యం క్వింటాకు బోనస్‌గా రూ.500 చొప్పున రైతులకు అందించినట్లు వివరించారు. సన్నాలకు బోసస్ అందిస్తున్నా ప్రతిపక్ష పార్టీల నాయకులు రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాకేంద్రంలో తోపుకుంటను ఆహ్లాదకర ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలో ఒక్క రైతుకు కూడా బోనస్ డబ్బులు బాకీ లేమని వివరించారు. గత పాలకులు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ ఒక వైపు అప్పులకు వడ్డీలు కడుతూనే మరో వైపు ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఇప్పటికే మహిళా గ్రూప్‌లకు ఇచ్చిన హామీ మేరకు వడ్డీ రూపాయలను బ్యాంక్‌లలో జమ చేసినట్లు వెల్లడించారు. అనంతరం లబ్ధిదారులకు ఆయా మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అర్హులకు సన్నబియ్యం పంపిణీ చేయడమే కాకుండా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం పథకానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ డీలర్లు ఎవరైనా బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, జిల్లా అధికారి ఫైసల్ హుస్సేని, తహసీల్దార్ విజయభాస్కర్ పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతికి మహనీయుల పోరాటం
పీడిత ప్రజల అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన మహనీయుల సేవలను మరచిపోవద్దని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో బుధవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ధార్ సర్వాయి పాపన్న 315వ వర్థంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. అదే విధంగా మల్లంపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కై లాస్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన నిర్వహించిన జైబాపు–జైభీం–జై సంవిధాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మహనీయుల సేవలు మరిచిపోవద్దు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

అర్హులందరికీ సన్నబియ్యం