
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మంగపేట/కన్నాయిగూడెం/ఏటూరునాగారం/ములుగురూరల్: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మంగపేట, కమలాపురం గ్రామాల్లో సీతక్క గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా కమలాపురం, మంగపేటలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు, కల్యాణి లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు పేదలకు సన్నబియ్యం పథకం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో వరివేస్తే ఉరే అన్న చందం నుంచి నేడు వరి పండిస్తేనే సిరి అనే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేడ్కర్, కొమురం భీమ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు పైడాకులు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం కులమతాలలో చిచ్చు పెట్టి భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మంత్రి సీతక్క కన్నాయిగూడెం మండల పరిధిలోని ఏటూరు, చింతగూడెం, బుట్టాయిగూడెం, సర్వాయి గ్రామాల్లో పర్యటించి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బుట్టాయిగూడెంలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. ఏటూరునాగారం మండలంలోని 1వ వార్డులోని రేషన్ షాపులో, అలాగే ములుగు మండల పరిధిలోని జంగాలపల్లిలోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ దివాకర తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు హాస్టల్‌ను ఇల్లులాగా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న మంత్రికి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రేవతి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుహాసిని, వార్డెన్ లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం