
నల్లబ్యాడ్జీలతో నిరసన
మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌కు 500మీటర్ల పరిధిలోని పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ నిర్వాసితులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాడిచర్ల, కాపురం జెన్‌కో భూ నిర్వాసితుల సాధన కమిటీ అధ్యక్షుడు కేసారపు రవి మాట్లాడుతూ.. డేంజర్ జోన్ భూముల సేకరణపై స్పష్టత లేకుండానే ఓపెన్‌కాస్ట్ ఏఎమ్మాఆర్ కంపెనీ అధికారులు 100 మీటర్ల పరిధిలో మట్టిని డంపింగ్ చేయడానికి ప్రయత్నించడంతో అడ్డుకొని వెనక్కి పంపించినట్లు తెలిపారు. దీనికి నిరసనగా తాడిచర్ల చింతలకుంట వద్ద ఉపాధి పనులు చేస్తున్న డేంజర్ జోన్‌కు సంబంధించిన ఉపాధి కూలీలతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధి హామీ కూలీలు పనిచేయడం భూ నిర్వాసితుల ఐక్యతను నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం స్పందించి డేంజర్ జోన్ ఇళ్లను సేకరించి, నష్టపరిహారం, పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.