
బీరమయ్య.. శరణమయ్యా
వాజేడు : దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టపై వెలసిన బీరమయ్య జాతర వేడుకలు నేటినుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్ట గండి వద్ద శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజుల పాటు బీరమయ్య (భీష్మ శంకరుడు) జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మండల పరిధిలోని టేకులగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం జాతర వేడుకను ప్రారంభిస్తారు. నేడు (శనివారం) ఉదయం నుంచి సమీప గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు తమ దేవర్లను ఊరేగింపుగా జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. రాత్రి 8 గంటలకు గిరిజనులు తమ ఆచారాల ప్రకారం నృత్యాలను చేస్తారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గంగ స్నానాలు ఆచరించి బీరమయ్య దేవుడిని ప్రతిష్ఠిస్తారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కాగా సోమవారం తమ తమ దేవర్లను తీసుకుని ఎవరి ఇళ్లకు వారు పయనమవుతారు. దీంతో జాతర వేడుక ముగుస్తుంది.
ముమ్మరంగా ఏర్పాట్లు
బీరమయ్య జాతర శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో టేకులగూడెం గ్రామస్తులు అందుకు తగిన ఏర్పాట్లను చేపట్టారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు భక్తులు గుట్టపైకి వెళ్లే దారిలోని రాళ్లను, ముళ్లపొదలను తొలగించి ముగ్గులు పోశారు. బీరమయ్య గుడి వద్ద భక్తుల సౌకర్యార్థం చలువా పందిర్లను ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి తాగునీటి ఏర్పాట్లను చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టారు. శనివారం రాత్రి నుంచి జాతర తంతు మొదలు కానుంది. కాగా తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తుల తరలి రానున్నారు.
నేటినుంచి బీరమయ్య
(భీష్మ శంకర) జాతర
మొక్కులు చెల్లించనున్న
రెండు రాష్ట్రాల భక్తులు

బీరమయ్య.. శరణమయ్యా

బీరమయ్య.. శరణమయ్యా