
పూర్తిస్థాయి మందులు నిల్వ ఉండాలి
ములుగు/ములుగు రూరల్ : ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మందుల నిల్వలు ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాకారం, ములుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. ఓఆర్‌ఎస్, జింక్ కార్నర్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మందుల నిల్వల రిపోర్టులను రోజు వారిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రాల మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ జితేందర్, నవ్య, సూపర్‌వైజర్ దేవమ్మ, ఆరోగ్య కార్యకర్తలు తిరుమల, నర్సమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు