
మహాజాతర పనులకు రూ.145 కోట్లు
ములుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరలో చేపట్టే వివిధ పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.145 కోట్లు కేటాయించనుందని, ఈ మేరకు అన్ని శాఖల అధికారులు ప్రణాళికతో పనులు పూర్తిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన మేడారం మహాజాతర 2026ను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించగా మంత్రికి పలుశాఖల అధికారులు వివిధ రకాల పనుల గురించి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారంలో 6 నెలల ముందుగా పనులు చేపట్టి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఏడాదిలో మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరతో పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రెండు పెద్ద పండుగలను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కుంభమేళా తరహాలో సాగుతున్న మేడారం జాతరను విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. గత మహాజాతర సందర్భంగా మిగిలి ఉన్న రూ.50 కోట్లను సైతం రానున్న మహాజాతరకు వినియోగిస్తామని వెల్లడించారు. గద్దెల పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు జంపన్న వాగుపై రూ.5 కోట్లతో పెద్దలు, పిల్లలు సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర సందర్భంగా తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ గతంలో మేడారం మహాజాతరలో పనిచేసిన అధికారుల సూచనలతో రానున్న మహాజాతరను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఆర్డీఓ వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఎఫ్‌డీఓ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాబోయే జాతర నాటికి మేడారంలో శాశ్వత పనులు చేయాలి
ఫీల్డ్ విజిట్ చేసి
ప్రతిపాదనలు సమర్పించాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క
భూ భారతితో సమస్యలు పరిష్కారం
మంగపేట: ఽరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో అన్ని రకాల భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూ సమస్యలను పరిష్కరించి పట్టాలు అందజేసేలా సీఎం రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్‌జీ మాట్లాడుతూ భూభారతి చట్టంతో 90శాతం భూ సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం మంత్రి సీతక్క వివిధ గ్రామాలకు చెందిన 35మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రికి పలువురు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు తదితర సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.