
మహాజాతరలో శాశ్వత తాగునీటి పనులకు ప్రణాళికలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో 2026 ఫిబ్రవరిలో జరగనున్న మహాజాతరలో శాశ్వత తాగునీటి పనుల కోసం ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ సురేష్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి శుక్రవారం మేడారంలో పర్యటించారు. 2026లో జరిగే మహాజాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు శాశ్వత తాగునీటి వసతి కల్పించనున్న పనుల ప్రదేశాలను గుర్తించారు. మేడారం పరిసర ప్రాంతంలోని చింతల్ క్రాస్ రోడ్డు, కాల్వ పల్లి క్రాస్, కన్నెపల్లి, చిలకలగుట్ట, జంపన్నవాగు బ్రిడ్జి పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్, శివరాంసాగర్ చెరువు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో భక్తులు వేలాదిగా విడిది చేస్తారని గుర్తించారు. తాగునీటి పనుల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాశ్వత పనుల నిర్మాణానికి గుర్తించిన ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రణాళికలను తయారు చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. మేడారంలో 2026లో మహాజాతరకు వచ్చే భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వచ్చే మహాజాతరకు జాతర పరిసర ప్రాంతాల్లో సకల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లేష్, ఈఈలు మాణిక్యరావు, రామాంజనేయులు, సుభాష్, డీఈలు సునీత, సతీష్, జీవన్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
మేడారంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్
అధికారుల బృందం పర్యటన

మహాజాతరలో శాశ్వత తాగునీటి పనులకు ప్రణాళికలు