
అర్హుల ఎంపిక త్వరగా పూర్తిచేయాలి
ములుగు: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం మండల స్థాయి వెరిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ మండలంలో నలుగురు అధికారులను నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు సమర్పించిన వివరాలు రాష్ట్రస్థాయిలో పరిశీలనలో ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని తెలిపారు. అయితే లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే రిమార్క్స్ కాలంలో నమోదు చేయాలని సూచించారు. గడువులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యంత నిరుపేదలు, అసలు ఇళ్లులేని వారిని అర్హులుగా ఎంపిక చేయాలని తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మూడు కేటగిరిల్లో విభజించినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఎల్ 1 కేటగిరిలో ఇంటి స్థలం ఉన్న వారిని, ఎల్ 2 కేటగిరిలో ఇంటి స్థలం, ఇల్లులేని వారిని, ఎల్ 3 కేటగిరిలో అర్హతలు లేని వారిని గుర్తించాలన్నారు. వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత గ్రామ పంచాయతీల్లో అర్హుల జాబితాను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, ఏపీడీ వెంకటనారాయణ, ఈడీఎం దేవేందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర