
త్వరలోనే కీమో, రేడియోథెరపీ వైద్యసేవలు
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు త్వరలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు కానున్న క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా బాధితులకు వైద్యం అందించడానికి కీమో, రేడియోథెరపీ సేవలు అందుబాటులోకి రానున్నాయని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్‌లో పీహెచ్‌సీ వైద్యులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎంఎల్‌హెచ్‌పీలు, ఆర్‌బీఎస్కే వైద్యులు, సూపర్‌వైజర్లతో అసంక్రమిత వ్యాధులపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోపాల్‌రావు మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా లక్షణాలు బయటపడకుండా మరణాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. మే 1నుంచి వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ వరకు నాలుగవ విడత స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. గ్రామ స్థాయిలో అంగన్ వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీలు భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలోని సబ్‌సెంటర్ల ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలపత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ పరిశీలకుడు సత్యేంద్రనాథ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్స్ రణధీర్, పవన్‌కుమార్, చంద్రకాంత్, డెమో సంపత్, ఎన్‌సీడీ కోఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు