
నమూనా ఇందిరమ్మ ఇల్లు
నిబంధనలకు అనుగుణంగా..
లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మించుకునేలా చూస్తాం. జిల్లాలో సొంత స్థలం కలిగిన పేదలను గుర్తించి జాబితా సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశాం. ఇల్లు నిర్మించుకునే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపారు. ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది.
– సంగప్ప, పీడీ, గృహనిర్మాణశాఖ
అచ్చంపేట: నమూనా ఇందిరమ్మ ఇంటిని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణల్లో ప్రభుత్వం నిర్మిస్తుంది. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే రూ.5 లక్షల సాయంతో నిర్మించుకునేలా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు కట్టించే ఇళ్లకు తొలిసారి జియో ఫెన్సింగ్ చేయడంతో పాటు కృత్రిమ మేధా సాయంతో ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పిన నేపథ్యంలో జియో ఫెన్సింగ్ విధానం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సాయంలోనే పూర్తయ్యేలా..
ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయిచనుంది. ఈ మొత్తంలో ఏ విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చనేది ప్రయోగాత్మకంగా చూపడానికే నమూనా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇంటి నిర్మాణానికి కనీసం 60 గజాల స్థలం ఉండాలనే నిబంధన ఉంది. ఇందులో స్లాబ్ ఏరియా 400 చదరపు అడుగులు ఉంటుంది. 12.5 అడుగుల వెడల్పు, 10.5 అడుగుల పొడవుతో పడక గది, 6.9 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో వంట గది, 9 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో హాల్ నిర్మిస్తున్నారు. ఇంటిపైకి మెట్ల నిర్మాణం అనేది లబ్ధిదారుడి ఇష్టం. దీంతోపాటు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 8 పిల్లర్లలోనే నిర్మాణం పూర్తి చేసేలా నమూనా రూపొందించారు. ఇందుకు సంబంధించిన మ్యాప్ ఆధారంగా లబ్ధిదారు ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
ఒకేలా ఉండేలా..
తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహ నిర్మాణశాఖ ఇచ్చే నమూనా అందరికీ ఒకేలా ఉండేలా ప్రతి మండలంలో మోడల్ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గృహనిర్మాణశాఖకు జిల్లాకు పీడీ, నియోజకవర్గానికి డీఈ, ఏఈని నియమించారు. వీరి ద్వారా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని నిర్వహించనున్నారు.
ఉచిత ఇసుక సరఫరాపై దృష్టి..
మొదటి ప్రాధాన్యతగా సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే. అర్హుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేయగా.. ఎల్–1 జాబితా సిద్ధం చేసి గ్రామసభల్లో ప్రకటించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా 8 ట్రాక్టర్ల ఇసుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్ల ఆధ్వర్యంలో టోకెన్లు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పునాది తీ సిన తర్వాత తొలి విడత సాయంగా రూ.లక్ష అందిస్తారు. స్టీల్, సిమెంట్ తక్కువ ధరకు అందించాల ని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.
రూ.5 లక్షలతోనే లబ్ధిదారు నిర్మించుకునేలా..
జియో ఫెన్సింగ్, కృత్రిమ మేధా సాయంతో ప్రత్యేక యాప్
సర్వేలో చూపిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు

నమూనా ఇందిరమ్మ ఇల్లు
Comments
Please login to add a commentAdd a comment