కొత్త కార్డులకు మోక్షం లభించేనా?
●
అచ్చంపేట: రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ మరోసారి కొనసాగుతోంది. మీసేవ కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో 16,007 దరఖాస్తులు వచ్చాయి. గత నెలలో నాలుగు పథకాల అమలులో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో 7,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఎలాంటి రశీదు ఇవ్వలేదు. ఆ దరఖాస్తులను ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లోనూ నమో దు చేయలేదు. ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.
పేర్ల తొలగింపుపై సందిగ్ధం..
నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కార్డుల్లోనూ మార్పులు, చేర్పులకు వెసులుబాటు కల్పించింది. అయితే 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో.. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారి పేర్లు అలాగే ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన వారు, ఈ కాలంలో జన్మించిన పిల్లల పేర్లను చేర్చలేదు. కేవలం చనిపోయిన వారి పేర్లు మాత్రమే తొలగించారు. 2021 జూన్‌లో అప్పటి ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించి.. మంజూరు చేయకుండానే అర్ధాంతరంగా నిలిపివేయడంతో నాటి నుంచి దరఖాస్తుదారులు నిరీక్షిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుందామంటే.. కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి వస్తోంది. దీంతో పలువురు కొత్తకార్డుల జారీ ప్రక్రియ సజావుగా సాగుతుందా.. లేదా అని రెవెన్యూ అధికారులను అడుగుతున్నారు. దీంతో పాటు యూనిట్ల నమోదుకు సైతం సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్‌ఐ, తహసీల్దార్, డీఎస్‌ఓల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న యూనిట్ల నమోదు దరఖాస్తులను కమిషనర్ లాగిన్‌కు చేరవేసే ప్రక్రియను మాత్రమే పూర్తిచేశారు.
క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే..
రేషన్‌కార్డుల కోసం ప్రజలు ఒకటికి రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఆధార్ నంబర్ ఆధారంగా పరిశీలన చేపట్టనున్నారు. అర్హుల దరఖాస్తులను తహసీల్థార్ తాగిన్‌కు, ఆపై డీఎస్‌ఓ లాగిన్‌కు చేరవేయనున్నారు. 360 డిగ్రీస్ సాఫ్ట్‌వేర్‌లో వడపోసి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. మౌఖిక ఆదేశాల మేరకు దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ పరిశీలకులకు అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, గ్రామాల్లో కార్యదర్శులకు అప్పగించే అవకాశం ఉంది.
మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ
కులగణన, ప్రజాపాలన అర్జీలపై స్పష్టత కరువు
రేషన్‌కార్డుల కోసం
మరోసారి దరఖాస్తు
తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్నా..
మాది దినసరి కార్మిక కుటుంబం. నా పెళ్లి అయి తొమ్మిదేళ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేషన్ కార్డు కోసం మూడేళ్ల క్రితం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. ఇంత వరకు రాలేదు. ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం రేషన్‌కార్డు జారీ చేయాలి. – చీమర్ల మమత,
మారుతీ నగర్, అచ్చంపేట
మళ్లీ అవసరం లేదు..
గతంలో దరఖాస్తు చేసుకోని వాళ్లు మాత్రమే మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నింటినీ పరిశీలన చేసే అవకాశం ఉంది. – శ్రీనివాసులు,
జిల్లా పౌరసరఫరాల అధికారి
2021లో 6,010 దరఖాస్తులు..
జిల్లావ్యాప్తంగా 2021లో కొత్తకార్డులు, పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కోసం పౌరసరఫరాలశాఖకు 6,010 దరఖాస్తులు రాగా.. 5,016 దరఖాస్తులను ధ్రువీకరించారు. మిగిలిన 994 దఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలించి డీఎస్‌ఓ కార్యాలయానికి పంపించారు. ఇక్కడి నుంచి పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు చేరవేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు పచ్చజెండా ఊపాల్సి ఉంటుంది. ఇదివరకు కార్డులేని వారు, గతంలో మీసేవలో నమోదు చేసుకోని వారు మాత్రం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
కొత్త కార్డులకు మోక్షం లభించేనా?
Comments
Please login to add a commentAdd a comment