యశ్వంత్ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు
నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం పోచంపల్లి మండలంలోని మెహర్‌నగర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మండలం అంతమ్మగూడేనికి చెందిన బండారి ఈశ్వరయ్య, లలిత దంపతులకు యశ్వంత్(12), కుమార్తె ఉన్నారు. ఈశ్వరయ్య, లలిత దంపతులు స్థానికంగా ఓ రసాయన కంపెనీలో పనిచేస్తున్నారు.
యశ్వంత్ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ప్రగతి స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులిద్దరూ మంగళవారం ఉదయం కంపెనీలో పనికి వెళ్లగా.. యశ్వంత్ తన స్నేహితుడైన వస్పరి జశ్వంత్‌తో కలిసి మధ్యాహ్నం ఈత కొట్టేందుకు సైకిల్‌పై మెహర్‌నగర్ శివారులోని సిద్దప్ప చెరువు వద్దకు వెళ్లారు.
ఇద్దరు చెరువు ఒడ్డున బట్టలు, చెప్పులు విడిచి చెరువులోకి దిగారు. కాగా యశ్వంత్ చెరువు ఒడ్డు నుంచి కొద్దిదూరం వెళ్లగానే పెద్ద గుంతలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న వస్పరి జశ్వంత్ భయపడి ఊర్లోకి వెళ్లి యశ్వంత్ ఇంటి వద్ద సైకిల్ పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
దుస్తులను చూసి గుర్తించి..
ఇంటికి వచ్చిన యశ్వంత్ తల్లిదండ్రులు కొడుకు కనిపించకపోయేసరికి ఊరిలో వెతికారు. ఇరుగుపొరుగు వారిని కుమారుడి గురించి వాకబు చేశారు. మధ్యాహ్నం యశ్వంత్, జశ్వంత్ కలిసి చెరువు వైపు వెళ్లడం చూశానని గొర్రెల కాపరి వస్పరి పార్వతమ్మ చెప్పడంతో గ్రామస్తులతో కలిసి వెళ్లి చూడగా చెరువు ఒడ్డున యశ్వంత్ దుస్తులు, చెప్పులు కన్పించాయి.
చెరువులోకి దిగి వెతకగా యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. ఈ విషయం తెలుసుకొన్న చౌటుప్పల్ రూరల్ సీఐ మహేశ్, స్థానిక ఎస్‌ఐ విక్రంరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment